Rahul Gandhi : బైకుంది కానీ బయటకు తీయలేను..
ABN, First Publish Date - 2023-07-09T19:03:35+05:30
భారత్ జోడో యాత్రతో మొదలుపెట్టి వివిధ వర్గాల ప్రజలను కలుసుకోవడం, వారి సమస్యలు తెలుసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లోని బైక్ మెకానిక్ షాపులను సందర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తనకు కూడా కేటీఎం 390 బైక్ ఉందని చెప్పారు.
న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర (Bharata Jodo Yatra)తో మొదలుపెట్టి వివిధ వర్గాల ప్రజలను కలుసుకోవడం, వారి సమస్యలు తెలుసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈసారి ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లోని బైక్ మెకానిక్ షాపులను సందర్శించారు. అక్కడి మెకానిక్‌లతో ముచ్చటించారు. వారి అనుభవాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని బైక్‌ల రిపేర్ వర్క్‌లో వారికి సహాయపడుతూనే తనకు కూడా ఒక బైక్ ఉన్న విషయాన్ని, ఎందుకు దానికి బైటకు తీయడం లేదో చెప్పుకొచ్చారు. జూన్ 27న రాహుల్ వీరిని కలుసుకోగా, అందుకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ఇప్పుడు విడుదల చేశారు.
''నాకు కూడా కేటీఎం 390 (KTM-390) బైక్ ఉంది. కానీ దానిని నడిపేందుకు నా భద్రతా సిబ్బంది అనుమతించరు'' అని రాహుల్ అక్కడి మెకానిక్‌లతో నవ్వుతూ చెప్పారు. బైక్ నడిపే వ్యక్తి మెకానిక్ కాకపోతే ఆ బైక్‌కు ఎలాంటి సమస్య వచ్చినా తెలియదని, ఇక్కడి మెకానిక్‌లు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు, వారి సమస్యల గురించి అవగాహన చేసుకునేందుకు వచ్చినట్టు ఆయన చెప్పారు. మోటార్ బైక్ మీద లెహ్ నుంచి లద్దాఖ్ వరకూ ప్రయాణించాలని ఉందంటూ రాహుల్ తన మనసులోని మాట చెప్పినప్పుడు, 1980లో మోటార్ బైక్‌పై 15 రోజుల పాటు లెహ్ ట్రిప్ చేసినప్పటి అనుభవాలను ఓ మెకానిక్ రాహుల్‌కు వినిపించారు.
ఎన్నడూ ఊహించలేదు...
రాహుల్ గాంధీ తమను కలుసుకున్న అనుభవాన్ని ఓ మెకానిక్ వివరిస్తూ, రాహుల్‌తో కలిసి టీ తాగుతూ ముచ్చటించే అవకాశం వస్తుందని తాము ఎప్పుడూ అనుకోలేదని, బైకులకు సంబంధించిన అవగాహనకు కూడా రాహుల్‌కు ఉందని, ఆయనను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. భారత్ జోడో యాత్రతో రాహుల్ జనసామాన్యానికి దగ్గరకావడం, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం పట్ల ఆయనకు ఉన్న ఆసక్తి అభినందనీయమని మరో మెకానిక్ అన్నారు.
Updated Date - 2023-07-09T19:25:20+05:30 IST