Hero Vijay: పార్లమెంట్ ఎన్నికల్లోపే.. విజయ్ రాజకీయ ప్రవేశం
ABN, First Publish Date - 2023-09-01T08:08:41+05:30
పార్లమెంటు ఎన్నికల్లోగా రాజకీయ ప్రవేశానికి ప్రముఖ నటుడు విజయ్(Actor Vijay) సన్నాహాలు చేసుకుంటున్నారు.
చెన్నై, (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ఎన్నికల్లోగా రాజకీయ ప్రవేశానికి ప్రముఖ నటుడు విజయ్(Actor Vijay) సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా నెల రోజులుగా ఆయన విజయ్ మక్కల్ ఇయక్కమ్ సంస్థ(Vijay Makkal Iyakkam Company) కార్యకలాపాలను తీవ్రతరం చేశారు. రాష్ట్రంలో టెన్త్, ప్లస్-2 పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు జిల్లాలవారీగా ఉపకార వేతనాలు, పతకాలు, ప్రశంసాపత్రాలు వంటివి 24 గంటలపాటు నిర్విరామంగా నిర్వహించిన సాంఘిక సంక్షేమ కార్యక్రమం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత మక్కల్ ఇయక్కమ్ నిర్వాహకులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ ఏర్పాటు దిశగా చర్చిస్తున్నారు. ఈక్రమంలో ప్రజలకు సంస్థ కార్యకలాపాలను క్షణాల్లో చేర్చే దిశగా ఐటీ విభాగాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు ప్రారంభించారు. ఇటీవలే ఇయక్కమ్‌లోని ఐటీ విభాగం నిర్వాహకుల సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశంలో ఐటీ విభాగాన్ని పటిష్ఠపరిచే దిశగా ఇయక్కమ్ నేత విజయ్ జారీ చేసే ప్రకటనలు, ప్రసంగాలు క్షణాల్లో ప్రజలకు అందించేలా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం ఖాతాలను ఇయక్కమ్ సభ్యులు ప్రారంభించాలని ఆదేశించారు. అదే సమయంలో సాంకేతిక విభాగం సభ్యుల సంఖ్యను 30 వేలకు పెంచాలని కూడా నిర్ణయించారు.
ఈ నేపథ్యంలోనే విజయ్ మక్కల్ ఇయక్కమ్ వాట్సప్ గ్రూపుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇయక్కమ్ ఆధ్వర్యంలో 1600 వాట్సప్ గ్రూపులు పనిచేస్తున్నాయి. వీటి సంఖ్యను నెలలోపున 10 వేలకు పెంచాలని ఆయన ఉత్తర్వు జారీ చేశారు. ఇదిలా ఉండగా విజయ్ మక్కల్ ఇయక్కమ్ రాజకీయ పార్టీగా మారడం తథ్యమని విజయ్ సన్నిహితులు చెబుతున్నారు. నటుడు విజయకాంత్(Actor Vijayakanth) తన అభిమానుల సంఘాలను సమైక్యపరిచేందుకు ఇదేవిధంగా వాట్సప్ గ్రూపులు, ఫేస్‌బుక్ ఖాతాలు, ఇన్‌స్టాగ్రాంల సభ్యులను పెంచడం వంటి చర్యలు చేపట్టారని గుర్తు చేస్తున్నారు. విజయ్‌కాంత్ బాటలోనే నటుడు విజయ్ కూడా రాజకీయ ప్రవేశానికి ఇలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయ్ మక్కల్ ఇయక్కమ్ తప్పకుండా బరిలోకి దిగుతుందని, కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో తన సత్తాను చాటిచెప్పనున్నదని ఆ సంస్థ నిర్వాహకుడొకరు తెలిపారు.
Updated Date - 2023-09-01T08:08:43+05:30 IST