High Court: మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు.. వారి ఆస్తులు..
ABN, First Publish Date - 2023-05-02T11:00:18+05:30
మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. వారి ఆస్తులను
చెన్నై, (ఆంధ్రజ్యోతి): అవినీతికి పాల్పడే అధికారుల ఆస్తులను జప్తు చేయాలని మద్రాస్ హైకోర్టు(Madras High Court) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందులో సాధ్యాసాధ్యాలపై అభిప్రాయం తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణియం ఆదేశాలు జారీ చేశారు. కాంచీపురం(Kanchipuram) జిల్లా శివన్‌తాంగల్‌కు చెందిన వీఏఓ రాజేంద్రన్, ఆయన భార్య ధనలక్ష్మి, కుమారుడు ఢిల్లీ రాజా కలిసి శ్రీపెరంబుదూరులో 2 వేల చదరపుటడుగుల భూమిని కొనుగోలు చేశారు. దీని విలువ రూ.11.50 కోట్లు కాగా, ఈ ముగ్గురు కలిసి కేవలం రూ.10 లక్షలకే కొనుగోలు చేసినట్టు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ వారు గత 2010లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ స్థలం కొనుగోలు చేసిన తర్వాత స్థానిక పోలీసులు, కౌన్సిలర్, న్యాయవాది కలిసి రూ.10 లక్షల నగదు డిమాండ్ చేశారని, ఈ డబ్బులు ఇవ్వకపోవడంతో తమపై కేసు పెట్టారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులకు చట్ట నిబంధనల మేరకు భయం రుచి చూపిస్తే వారిలోని అవినీతి జాఢ్యం తొలగిపోతుందన్నారు. అపుడే అవినీతికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు. అవినీతికి పాల్పడే అధికారుల ఆస్తులను జప్తు చేసే విధానాన్ని అమల్లోకి తీసుకుని రావాలని సూచించారు.
Updated Date - 2023-05-02T11:00:18+05:30 IST