Wrestlers protest: హరిద్వార్‌లో హైడ్రామా.. గంగలో రెజ్లర్ల మెడల్స్ నిమజ్జనం వాయిదా..
ABN, First Publish Date - 2023-05-30T20:36:37+05:30
గంగా జలాల్లో మెడల్స్ నిమజ్జనం చేస్తామంటూ భారతదేశ టాప్ రెజ్లర్లు హరిద్వార్ చేరుకోవడంతో నెలకొన్న హైడ్రామా మరో మలుపు తిరిగింది. మెడల్స్ గంగలో పారేయవద్దంటూ రైతు నేత నరేష్ టికాయిత్ చేసిన విజ్ఞప్తితో రెజర్లు తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు. రెజర్ల నుంచి మెడల్స్ తీసుకున్న టికాయిత్, సమస్య పరిష్కరించడానికి తనకు 5 రోజులు గడువు ఇవ్వాలని వారిని కోరారు.
హరిద్వార్: గంగా జలాల్లో మెడల్స్ నిమజ్జనం చేస్తామంటూ భారతదేశ టాప్ రెజ్లర్లు (wrestlers) హరిద్వార్ (Haridwar) చేరుకోవడంతో నెలకొన్న హైడ్రామా మరో మలుపు తిరిగింది. మెడల్స్ గంగలో పారేయవద్దంటూ రైతు నేత నరేష్ టికాయిత్ (Naresh Tikait) చేసిన విజ్ఞప్తితో రెజర్లు తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు. రెజర్ల నుంచి మెడల్స్ తీసుకున్న టికాయిత్, సమస్య పరిష్కరించడానికి తనకు 5 రోజులు గడువు ఇవ్వాలని వారిని కోరారు.
బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ తదితరులు ఆరోపిస్తూ, ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని కొద్దికాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 23 నుంచి వీరు నిరసన తెలుపుతున్నారు. రెజ్లర్లు ఆదివారం నూతన పార్లమెంటు భవనంవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఢిల్లీ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. వినేష్ ఫోగట్, బజ్రంగ్ పూనియా, సంగీత ఫోగట్, సాక్షి మాలిక్, తదితరులను అదుపులోకి తీసుకున్నారు. రెజ్లర్లకు మద్దతుగా నిలుస్తున్న రైతు సంఘాలు తక్షణం వారిని విడిచిపెట్టకుంటే, సరిహద్దుల్లో దీక్షను కొనసాగిస్తామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ మంగళవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, రెజ్లర్లు ఈరోజు సాయంత్రం 6 గంటలకు హరిద్వార్‌లోని గంగా నదిలో తమ పతకాలను నిమజ్జనం చేస్తారని చెప్పారు. ఈ పతకాలు తమ ప్రాణమని, తమ ఆత్మ అని చెప్పారు. వీటిని గంగా నదిలోకి విసిరేసిన తర్వాత జీవించి ఉండటంలో అర్థం లేదన్నారు. వీటిని గంగా నదిలో కలిపేసిన తర్వాత తాము ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే రెజర్లు హరిద్వార్‌కు చేరుకోవడం, మెడల్స్‌ను గంగానదిలోకి కలిపేందుకు సమాయత్రం కావడంతో ఉగ్విగ్న వాతావరణం నెలకొంది. దీంతో రైతు నేత తికాయిత్ వారికి నచ్చచెప్పి, మెడల్స్ తనకు ఇవ్వాలని, సమస్య పరిష్కారానికి ఐదు రోజులు వ్యవధి ఇవ్వాలని కోరడంతో రెజర్లు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.
Updated Date - 2023-05-30T20:36:37+05:30 IST