Himachal pradesh: వృద్ధాప్య పెన్షన్లపై సర్కార్ సంచలన ప్రకటన
ABN, First Publish Date - 2023-01-13T20:00:35+05:30
ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సారథ్యంలోని హిమాచల్ ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ వృద్ధాప్య పెన్షన్ల స్కీమ్‌పై సంచలన..
సిమ్లా: ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu) సారథ్యంలోని హిమాచల్ ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ వృద్ధాప్య పెన్షన్ల స్కీమ్‌పై సంచలన ప్రకటన చేసింది. శుక్రవారంనాడు జరిపిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (Old Pension Scheme) పునరుద్ధరణకు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నట్టు సమావేశానంతరహం ముఖ్యమంత్రి సీఎం ప్రకటించారు. కొత్త పెన్షన్ పథకం (NPS) స్థానే ఓపీఎస్ అమలు చేయనునండటంతో రాష్ట్రంలోని 1.36 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది.
గత బీజేపీ ప్రభుత్వ హయాంలో కొత్త పెన్షన్ పథకాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిపారు. తాము అధికారంలోకి రాగానే తొలి మంత్రివర్గ సమావేశంలోనే పాత పెన్షన్ పునరుద్ధరిస్తామంటూ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, గెలుపు సాధించింది. అందుకు అనుగుణంగానే తొలి క్యాబినెట్ సమావేశంలో ఓపీఎస్ పునరుద్ధరణకు హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా, మహిళలకు నెలకు రూ.1,500 సాయం అందిస్తామనే హామీని నిలబెట్టుకునేందుకు క్యాబినెట్ మంత్రులతో నెలరోజుల్లో సబ్ కమిటీ వేయనున్నట్టు సీఎం ప్రకటించారు. లక్ష ఉద్యోగాల కల్పనను సుసాధ్యం చేసేందుకు కూడా కమిటీని వేస్తామని చెప్పారు.
Updated Date - 2023-01-13T20:00:36+05:30 IST