Hindenburg : అదానీ గ్రూప్ ఆరోపణలపై స్ట్రాంగ్ కౌంటర్..
ABN, First Publish Date - 2023-01-30T10:47:36+05:30
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ, అదానీ గ్రూప్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తన సంస్థకు వ్యతిరేకంగా రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదికపై అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున ఫైర్ అయిన విషయం తెలిసిందే.
Internet Desk : హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ (Hindenburg Research Institute), అదానీ గ్రూప్ (Adani Group)ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తన సంస్థకు వ్యతిరేకంగా రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదికపై అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున ఫైర్ అయిన విషయం తెలిసిందే. హిండెన్ బర్గ్ నివేదిక పచ్చి అబద్దాల పుట్ట అని కొట్టివేసింది. ఈ ఆరోపణలను కేవలం తమ కంపెనీపై మాత్రమే చేసిన దాడిగా చూడకూడదని, దేశీయ సంస్థల స్వాతంత్య్రం, సమగ్రత, విశ్వసనీయత, దేశ అభివృద్ధి, ఆశలపై జరిగిన దురుద్దేశపూర్వక దాడిగా చూడాలని కోరింది. దీనికి సంబంధించి ఆదివారం 413 పేజీలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేసింది.
అదానీ గ్రూప్ ప్రకటనపై తాజాగా హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఒకింత ఘాటుగానే స్పందించింది. అదానీ గ్రూప్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘‘జనవరి 24న ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ (Gowtham Adani) నిర్వహిస్తున్న.. దేశంలోనే అతి పెద్ద సంస్థల్లో రెండవది అయిన అదానీ గ్రూప్ నడిపిన కొన్ని అనుమానాస్పద మోసాలకు సంబంధించిన అంశాలను వివరిస్తూ ఒక నివేదికను విడుదల చేశాం. ఆ తరువాత అదానీ గ్రూప్ సంస్థ 413 పేజీలతో కూడిన ఒక ప్రకటనలో స్పందించింది. మేము ‘విదేశీ మారకపు చట్టాల ఉల్లంఘన (foreign exchange laws)’కు పాల్పడ్డామని అదానీ గ్రూప్ పేర్కొంది. ఇది మాపై మోపిన దారుణమైన ఆరోపణ. నిజానికి అసలు విషయాల నుంచి దృష్టి మరల్చడానికి చేసిన ప్రయత్నంలో భాగమే. అంతేకాకుండా మా నివేదికను భారత్‌పై దాడిగా అభివర్ణించింది. చెప్పాలంటే.. అదానీ గ్రూప్ చాలా తెలివిగా తమ గ్రూప్ పెరుగుదలను, అలాగే గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపదను భారతదేశ విజయంగా అభివర్ణించేందుకు యత్నిస్తోంది. దీంతో మేము విభేదిస్తున్నాం.
భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం (Democratic Country). అద్భుతమైన భవిష్యత్తుతో అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్ (Super Power) అని మేము నమ్ముతున్నాము. దేశాన్ని క్రమపద్ధతిలో దోచుకుంటూ భారత జెండాను కప్పుకున్న అదానీ గ్రూప్ భారతదేశ భవిష్యత్తును అడ్డుకుంటోంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరు మోసం చేసినప్పటికీ.. మోసం ఎవరు చేసినా మోసమే. అదానీ గ్రూప్ వెలువరించిన ప్రకటనలో 330 పేజీలు కోర్టు రికార్డులకు సంబంధించినవి కాగా... 53 పేజీలు ఉన్నత-స్థాయి ఆర్థిక, సాధారణ సమాచారంతో పాటు మహిళా వ్యవస్థాపకతను, సురక్షితమైన కూరగాయల ఉత్పత్తిని ఎలా ప్రోత్సహిస్తుందనే సంబంధం లేని వివరాలు ఉన్నాయి’’ అని హిండెన్‌బర్గ్ పేర్కొంది.
Updated Date - 2023-01-30T12:11:19+05:30 IST