One Nation-One Election : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ బిల్లు ఆమోదం పొందాలంటే..
ABN, First Publish Date - 2023-09-01T13:07:25+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్ సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విధానం ఆచరణ సాధ్యమేనా? దీనిని అమలు చేయడానికి తీసుకోవలసిన చర్యలేమిటి?
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్ సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విధానం ఆచరణ సాధ్యమేనా? దీనిని అమలు చేయడానికి తీసుకోవలసిన చర్యలేమిటి? వంటి అంశాలను అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశంలోని రాజకీయ పార్టీలతోనూ, రాష్ట్రాలతోనూ విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతుంది.
అయితే లోక్ సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, వెనుకగా 13 రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు జరగవలసి ఉంటుంది. కేంద్రం తీరుతో ఈ రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం పడుతుంది. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం చట్టాన్ని తీసుకురావాలంటే శాసన పరిశీలన సంఘం (Law Commission) ద్వారా సిఫారసులను పొందవలసి ఉంటుంది. కానీ దీని కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో అర్థమవుతోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం లేదని కొందరు చెప్తున్నారు. ఇప్పటికే దీనిని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండటంతో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే ఏమేమి అవసరమో చూద్దాం.
రాష్ట్రాలను ఒప్పించాలి
లోక్ సభ ఎన్నికలు షెడ్యూలు ప్రకారం జరుగుతాయని అనుకుంటే, ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసన సభల ఎన్నికలు లోక్ సభ ఎన్నికలతోపాటే జరగవలసి ఉంది. కానీ ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, మిజోరాం, తెలంగాణ, రాజస్థాన్ శాసన సభల ఎన్నికలు లోక్ సభ ఎన్నికల కన్నా ఐదు నెలల ముందుగానే జరగవలసి ఉంది. మరోవైపు హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ శాసన సభల ఎన్నికలు లోక్ సభ ఎన్నికల అనంతరం 5 నుంచి 7 నెలల్లోగా జరగవలసి ఉంది. ఈ రాష్ట్రాలన్నిటితోనూ సంప్రదించి, లోక్ సభ ఎన్నికలతోపాటు శాసన సభల ఎన్నికల నిర్వహణకు ఒప్పించడం సాధ్యం కావచ్చు. కానీ మిగిలిన 15 రాష్ట్రాల పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. వీటిలో కొన్ని రాష్ట్రాల శాసన సభల పదవీ కాలం ఒక ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఉంది. ఉదాహరణకు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరిగాయి. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాల్లో 2022లో ఎన్నికలు జరిగాయి. ఈ 15 రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వాలు లేవు. కొన్నిటిలో బీజేపీ, మరికొన్నిటిలో కాంగ్రెస్, ఇతర పార్టీలు, కూటములు అధికారంలో ఉన్నాయి. ఈ పార్టీలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి అధికారాన్ని ముందుగానే వదులుకోవడానికి ఇష్టపడే అవకాశం లేదు.
పార్లమెంటుతోపాటు రాష్ట్రాల్లో మెజారిటీ అవసరం
‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. దీనికి సంబంధించిన బిల్లుకు పార్లమెంటులోని ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. అంతేకాకుండా దేశంలోని 50 శాతం రాష్ట్రాలు దీనిని ఆమోదించాలి. లోక్ సభ సభ్యుల్లో 67 శాతం మంది, రాజ్య సభ సభ్యుల్లో 67 శాతం మంది మద్దతివ్వాలి.
ఇవి కూడా చదవండి :
One Nation-One Election : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం కేంద్రం మరో ముందడుగు
Updated Date - 2023-09-01T13:07:25+05:30 IST