Mimicry row: మిమిక్రీ రసాభాస.. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్న కల్యాణ్ బెనర్జీ
ABN, Publish Date - Dec 20 , 2023 | 03:07 PM
రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ను వ్యంగ్యంగా అనుకరించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఈ ఘటనపై వివాదం రేగడంపై వివరణ ఇచ్చారు. తన చర్య వెనుక ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం లేదని అన్నారు. ధన్‌ఖడ్ తనకంటే సీనియర్ అని, లాయర్లుగా తాము ఒకే ప్రొఫెషన్‍లో కొనసాగామని చెప్పారు.
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankar)ను వ్యంగ్యంగా అనుకరించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) ఈ ఘటనపై వివాదం రేగడంపై వివరణ ఇచ్చారు. తన చర్య వెనుక ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం లేదని అన్నారు. ధన్‌ఖడ్ తనకంటే సీనియర్ అని, లాయర్లుగా తాము ఒకే ప్రొఫెషన్‍లో కొనసాగామని చెప్పారు.
''నేను చేసిన పేరడీ చూసి ఆయన (ధన్‌ఖడ్) భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు? అది ఆయనను ఉద్దేశించినదేనని అనుకుంటే రాజ్యసభలో ఆయన అలాగ ప్రవర్తించారా అనేదే నా ప్రశ్న'' అని బెనర్జీ అన్నారు.
రాహుల్ అలా చేయడం వల్లే: మమత
రాజ్యసభ స్పీకర్‌ను అనుసరిస్తూ కల్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడం వివాదాస్పదం కావడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో కలుసుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కల్యాణ్ బెనర్జీ చేసిన మిమిక్రీని రాహుల్ గాంధీ చిత్రీకరించడం వల్లే వివాదం మొదలైందని అన్నారు. ఆయన (రాహుల్) వీడియో తీయకుండా ఉంటే ఆ ఘటనను ఎవరూ పట్టించుకునే వారు కాదన్నారు.
ధన్‌ఖడ్‌కు ప్రధాని ఫోన్..
పార్లమెంటు ఆవరణలో జరిగిన వివాదాస్పద మిమిక్రీ ఘటనపై ఉపరాష్ట్రపతికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఇందుకు ధన్‌ఖడ్ స్పందిస్తూ, ఇలాంటి ఘటనలు తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించే విషయంలో కానీ, రాజ్యాంగ సిద్ధాంతాలను పాటించే విషయంలో కానీ తన మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేవని అన్నారు.
రాష్ట్రపతి ఆందోళన..
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ''పార్లమెంటు కాంప్లెక్స్‌లో ఉప రాష్ట్రపతిని చిన్నబుచ్చే విధంగా వ్యవహరించిన తీరు నన్ను అసంతృప్తికి గురిచేసింది. ఎన్నికైన ప్రతినిధులు స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తం చేయవచ్చు, అయితే అవి హుందాగా, గౌరవప్రదంగా ఉండాలి'' అని ద్రౌపది ముర్ము ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
సభా గౌరవాన్ని కాపాడటం నా బాధ్యత: ధన్‌ఖడ్
పార్లమెంటు ఆవరణలో జరిగిన సంఘటనపై రాజ్యసభలో ధన్‌ఖడ్ మాట్లాడుతూ, జగ్దీప్ ధన్‌ఖడ్‌ను (తనను) ఎంతగా అవమానించినా లెక్కచేయనని, అయితే రైతు కులానికి చెందిన ఉపరాష్ట్రపతిని అమానించడం సహించలేనని అన్నారు. సభా గౌరవాన్ని కాపాడటం తన బాధ్యత అని చెప్పారు.
కులం ప్రస్తావన ఎందుకు?: ఖర్గే
మిమిక్రీ వివాదంపై జగ్దీప్ ధన్‌ఖడ్ నా కులంపై దాడి జరగిందని చెప్పడం ఏమాత్రం సబబని పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. సభలో తనను కూడా మాట్లాడేందుకు చాలాసార్లు అనుమతించలేదని, తమ కులంపై కూడా ఆ ప్రభావం ఎక్కువగానే ఉందన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, మిమిక్రీ అనేది ఒక కళ అని, ధన్‌ఖడ్‌పై మిమిక్రీ చేశారని ఎవరూ అనలేరని, ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి (ధన్‌ఖడ్) కులం గురించి మాట్లాడటం ఏమిటని ఆయన నిలదీశారు.
Updated Date - Dec 20 , 2023 | 03:13 PM