Deve Gowda: 2024 ఎన్నికల్లో జేడీఎస్ మద్దతెవరికో వెల్లడించిన దేవెగౌడ
ABN, First Publish Date - 2023-04-15T13:46:42+05:30
2024 సార్వత్రిక ఎన్నికల్లో జనతాదళ్ సెక్యులర్ పార్టీ మద్దతు ఎవరికి ఇస్తుందో ఆ పార్టీ చీఫ్, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ..
బెంగళూరు: 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనతాదళ్ సెక్యులర్ (JDS) పార్టీ మద్దతు ఎవరికి ఇస్తుందో ఆ పార్టీ చీఫ్, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ (HD Deve Gowda) వెల్లడించారు. వామపక్షాలకు (Left parties) బాసటగా ఉంటామని ఆయన చెప్పారు. వామపక్షాలు ఎవరికైతే మద్దతుగా నిలుస్తాయో వారికే జేడీఎస్ మద్దతు ఇస్తుందని శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. వామపక్షాలకు దేవెగౌడ మద్దతు ప్రకటించడం వెనుక ఒక కీలక కారణం కూడా ఉంది.
దేవెగౌడ పేరు ప్రతిపాదించిన జ్యోతిబసు
దేవెగౌడ ఎవరూ ఊహించని విధంగా 1996లో ప్రధాన మంత్రి అయ్యారు. నిజానికి దేవెగౌడ కూడా ఈ అవకాశాన్ని ఊహించి ఉండరు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో ప్రధాన మంత్రి పదవిని చేపట్టే అవకాశం వామపక్ష దిగ్గజ నేత జ్యోతిబసుకు వచ్చింది. అయితే, జ్యోతిబసు సున్నింతంగానే ఆ పదవిని నిరాకరిస్తూ, దేవెగౌడ పేరును ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనతో దేవెగౌడ భారతదేశ 11వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేవెగౌడకు ఇప్పుడు కృతజ్ఞతలు తెలుపుకొనే అవకాశం వచ్చింది. అందుగు అనుగుణంగానే 2024 లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాలకు ఆయన తాజాగా మద్దతు ప్రకటించారు.
కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు
లోక్‌సభ ఎన్నికల ముందు విపక్షాల ఐక్యత గురించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌పై దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముందు తన సొంత ఇల్లు (పార్టీ) చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. ఈ దేశంలో నాయకత్వం వహించే వారికి కొదవలేదని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రతిపక్ష పార్టీ కాదని, కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు ఇతర రాష్ట్రాల, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు ఉన్నట్టు మీడియా ప్రధానంగా చెబుతోందని, జేడీఎస్ ప్రస్తావన జరగడం లేదని, అయితే జేడీఎస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, తమ పార్టీకి ఉన్న విజన్ జేడీఎస్ గెలుపునకు దోహదం చేస్తాయని చెప్పారు.
Updated Date - 2023-04-15T13:51:14+05:30 IST