నగరంలో.. నాలుగు ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం
ABN, First Publish Date - 2023-09-08T09:15:43+05:30
నగరంలో నాలుగు ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి పోలీసులు అనుమతించారు. వినాయక చవితి వేడుకలను ఈ నెల 18వ
పెరంబూర్(చెన్నై): నగరంలో నాలుగు ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి పోలీసులు అనుమతించారు. వినాయక చవితి వేడుకలను ఈ నెల 18వ తేది ప్రజలు జరుపుకోనున్నారు. హిందూ మున్నని, భారత హిందూ మున్నని సహా పలు సంస్థలు భారీ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. నగరంలో సుమారు 2 వేల ప్రాంతాల్లో భారీ విగ్రహాల విగ్రహాల ఏర్పాటుకు నిర్వాహకులు పోలీసుల నుంచి అనుమతి పొందినట్లు సమాచారం. ఇక, చిన్న విగ్రహాలు, ఇళ్లలో ఉంచే విగ్రహాలు ఇలా మరో 50 వేల విగ్రహాలు పూజల అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి సమీపంలోని జలాశయాల్లో నిమజ్జనం చేయనున్నారు.
నాలుగు ప్రాంతాల్లో....
ఈ నెల 18వ తేది వినాయక చవితి నుంచి ఐదు రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఐదవ రోజైన ఆదివారం విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయనున్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం పట్టణంబాక్కం శ్రీనివాసపురం, నీలాంగరై పల్‌కలై నగర్, కాశిమేడు ఫిషింగ్ హార్బర్, తిరువొత్తియూర్ పాపులర్ ఏడై మేడ వెనుక భాగం తదితర నాలుగు ప్రాంతాలు ఎంపిక చేశారు. విగ్రహాల ఊరేగింపు కోసం 17 మార్గాలు సిద్ధంచేశారు.
పట్టణంబాక్కం శ్రీనివాసపురం: నుంగంబాక్కం, చింతాద్రిపేట, ఎగ్మూర్, పుదుపేట, పెరంబూర్, వ్యాసర్పాడి, ఆర్కే నగర్, పులియాంతోపు, పటాలం, షావుకారుపేట, అయనావరం తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే విగ్రహాలు నిర్ధేశిత మార్గాల ద్వారా పట్టణంబాక్కం శ్రీనివాసపురం సముద్రతీరానికి తీసుకెళ్లి నిమజ్జనం చేయాలి. మిగిలిన ప్రాంతాల్లోని విగ్రహాలను నిర్ధేశిత మార్గాల్లో ఊరేగిపుంగా తీసుకెళ్లి కేటాయించిన ప్రాంతంలో నిమజ్జనం చేయాలి.
20 వేల మంది పోలీసులు...
వినాయక చవితికి ఇంకా 10 రోజులే ఉన్న నేపథ్యంలో, పోలీసు శాఖ అప్రమత్తమైంది. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నగరవ్యాప్తంగా 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహాలు ఏర్పాటుచేసే కమిటీలతో నగర పోలీసు కమిషనర్ రెండ్రోజుల్లో సమావేశం కానున్నారు. విగ్రహాలు ఏర్పాటుచేసే ప్రాంతాల్లో పోలీసులు 24 గంటలు షిఫ్టు పద్ధతిలో విధులు నిర్వహించనుండగా, వాహనాల్లో ప్రత్యేకంగా గస్తీ తిరుగుతారు. పోలీసు శాఖ సూచించిన నిబంధనలు పాటించి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా నిర్వాహక కమిటీలు, ప్రజలు సహకరించాలని నగర పోలీసు శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
Updated Date - 2023-09-08T09:15:44+05:30 IST