Imran Khan: పాక్ అడుక్కుతింటోంది
ABN, First Publish Date - 2023-03-05T20:26:11+05:30
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సంచలన
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ నాటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వా దయతో ప్రధాని అయ్యారని ఇమ్రాన్ చెప్పారు. షెహబాజ్ షరీఫ్ వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పాకిస్థాన్ అంతర్జాతీయంగా విమర్శలపాలైందన్నారు. ప్రపంచ దేశాల వద్దకు వెళ్లి పాక్ అడుక్కుంటోందని ఇమ్రాన్ వాపోయారు. పాక్ ఆర్ధిక పరిస్థితి కుప్పకూలిపోయిందన్నారు. పనిలో పనిగా ఆయన ఆసిఫ్ జర్దారీపైన కూడా విమర్శలు చేశారు. ఆసిఫ్ జర్దారీ ఓ హంతకుడని ఇమ్రాన్ ఆరోపించారు.
మరోవైపు ఇమ్రాన్ ఖాన్ తోషఖానా కేసు (Toshakhana case)లో అరెస్టయ్యే అవకాశం ఉంది. పోలీసులు నాన్-బెయిల్‌బుల్ అరెస్టు వారెంట్‌తో లాహోర్‌లోని జమాన్ పార్క్ నివాసానికి చేరుకున్నారు. దీంతో ఇమ్రాన్ మద్దతుదారులు, పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ (PTI) కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఇమ్రాన్ నివాసం వెలుపల హైడ్రామా నెలకొంది. ఇమ్రాన్ మద్దతుదారుల నినాదులు, నిరసనలతో పోలీసులు ముందుకు వెళ్లలేకపోయారని వార్తలు వచ్చాయి.
తోషఖానా కేసు విచారణకు ఇమ్రాన్ పదేపదే గైర్హాజరు అవుతుండటంతో ఆయనకు కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. లీగల్ విధివిధానాలు పూర్తి చేసి ఇమ్రాన్‌ను అరెస్టు చేస్తారని తెలుస్తోంది. కాగా, అతికష్టం మీద ఇమ్రాన్ నివాసంలోకి ఒక సీనియర్ అధికారి అడుగుపెట్టారని, అయితే అక్కడ ఇమ్రాన్ జాడ కనిపించలేదని పోలీసు వర్గాల సమాచారం. అరెస్టు నుంచి తప్పించుకునే క్రమంలోనే ఆయన తన నివాసానికి దూరంగా ఉన్నారని వారు అనుమానిస్తున్నారు.
పోలీసులకు దొరక్కుండానే ఇమ్రాన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
Updated Date - 2023-03-05T20:26:14+05:30 IST