Russian Oil : రష్యా నుంచి చౌక చమురు దిగుమతిలో మరో రికార్డు
ABN, First Publish Date - 2023-06-04T15:53:35+05:30
రష్యా నుంచి చౌక ధరకు చమురును దిగుమతి చేసుకోవడంలో భారత దేశం రికార్డు సృష్టిస్తోంది. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురు కన్నా ఎక్కువగా మే నెలలో దిగుమతి చేసుకుంది.
న్యూఢిల్లీ : రష్యా నుంచి చౌక ధరకు చమురును దిగుమతి చేసుకోవడంలో భారత దేశం రికార్డు సృష్టిస్తోంది. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురు కన్నా ఎక్కువగా మే నెలలో దిగుమతి చేసుకుంది. ఇది ఏప్రిల్ నెలలో దిగుమతి చేసుకున్నదాని కన్నా 15 శాతం ఎక్కువ. మే నెలలో రోజుకు సగటున 1.96 మిలియన్ బ్యారళ్ల చమురును దిగుమతి చేసుకుంది. ఎనర్జీ కార్గో ట్రాకర్ వోర్టెక్సా (Vortexa) ఈ వివరాలను వెల్లడించింది.
మే నెలలో భారత దేశం (India) వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న క్రూడాయిల్‌లో దాదాపు 42 శాతం కేవలం రష్యా (Russia) నుంచి దిగుమతి చేసుకుంది. ఇటీవలి సంవత్సరాల్లో ఓ దేశం ఇంత పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి దిగుమతులు తగ్గుతుండటం గమనార్హం. సౌదీ అరేబియా (Saudi Arabia) నుంచి దిగుమతులను పరిశీలించినపుడు మే నెలలో 5,60,000 టన్నుల చమురును భారత్ దిగుమతి చేసుకుంది. ఇది 2021 ఫిబ్రవరితో పోల్చుకుంటే చాలా తక్కువ. పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి ఒపెక్ (OPEC) నుంచి భారత దేశం అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటూ ఉండేది. కానీ మే నెలలో ఈ దేశాల నుంచి కేవలం 39 శాతం మాత్రమే దిగుమతి చేసుకుంది. ఇంత తక్కువ చమురును ఈ దేశాల నుంచి గతంలో దిగుమతి చేసుకున్న దాఖలాలు లేవు. గతంలో భారత్ అవసరాల్లో 90 శాతం వరకు ఈ దేశాల నుంచే దిగుమతి చేసుకునేది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా రాయితీ ధరకు చమురును ఎగుమతి చేస్తోంది. దీని నుంచి భారత్ ప్రయోజనం పొందుతోంది.
ఏప్రిల్‌లో రష్యా నుంచి చమురు మన దేశానికి రావడానికి అన్ని ఖర్చులతో కలుపుకుని ఒక బ్యారెల్ ధర 68.21 డాలర్లు. అదే నెలలో సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఒక బ్యారెల్ క్రూడాయిల్ ధర 86.96 డాలర్లు. కాగా ఇరాక్ నుంచి వచ్చిన ఒక బ్యారెల్ చమురు ధర 77.77 డాలర్లు. మే నెలలో క్రూడాయిల్ ధరలు ఇంకా వెల్లడికాలేదు.
రష్యా నుంచి చమురు దిగుమతులను యూరోపియన్ యూనియన్ డిసెంబరులో నిషేధించింది. దీనిని భర్తీ చేసుకోవడం కోసం రష్యా మన దేశానికి పెద్ద ఎత్తున క్రూడాయిల్‌ను విక్రయిస్తోంది.
ఇవి కూడా చదవండి :
Rajastan : బహిరంగ సభలో మైక్‌ను నేలకేసి కొట్టిన సీఎం గెహ్లాట్.. కారణం ఏంటో తెలుసా...
Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై మోదీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు
Updated Date - 2023-06-04T15:53:35+05:30 IST