Sanatan Dharma: ఇండియా బ్లాక్ ఏర్పాటు లక్ష్యంపై డీఎంకే మంత్రి సంచలన వ్యాఖ్య, బీజేపీ ఎదురుదాడి
ABN, First Publish Date - 2023-09-12T19:49:34+05:30
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారానికి తాజాగా తమిళనాడు ఉన్నతవిద్యా శాఖ మంత్రి కె.పొన్ముడి ఆజ్యం పోశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సనాతన ధర్మంపై పోరాటానికే ఇండియా కూటమి ఆవిర్భవించిందని ఆయన అన్నారు.
చెన్నై: సనాతన ధర్మం (Sanatan Dharma)పై ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారానికి తాజాగా తమిళనాడు ఉన్నతవిద్యా శాఖ మంత్రి కె.పొన్ముడి (K.Ponmudy) ఆజ్యం పోశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సనాతన ధర్మంపై పోరాటానికే ఇండియా కూటమి (I.N.D.I.A. alliance) ఆవిర్భవించిందని ఆయన అన్నారు. ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజా తరువాత సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన డీఎంకే మూడవ నేత పొన్ముడి కావడం విశేషం.
సనాతన ధర్మపై డీఎంకే నేతల వ్యాఖ్యలు 'ఇండియా' కూటమి నేతలను ఇరుకున పెడుతుండగా, ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్, ఆప్ ఇప్పటికే ప్రకటించాయి. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఆప్ నేత రాఘవ్ చద్దా మంగళవారంనాడు ఖండించారు. కూటమి పార్టీలకు చెందిన చిన్న నేతలు ఇచ్చే ప్రకటనలను 'ఇండియా' బ్లాక్ అధికారిక నిర్ణయంగా పరిగణించరాదని అన్నారు. "నేను సనాతన ధర్మం నుంచే వచ్చాను. ఇలాంటి ప్రకటనలు నేను వ్యతిరేకిస్తాను. ఎవరూ ఇలాంటి ప్రకటనలు చేయకూడదు. మతం ఏదైనా సరే దానిపై వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. అన్ని మతాలను మనం గౌరవించాలి'' అని రాఘవ్ చద్దా అన్నారు.
సనాతన ధర్మం ప్రజల్లో విభజన, విపక్షతను ప్రోత్సహిస్తుందని, సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను డీఎంకే నేత ఎ.రాజా బలపరుస్తూ, సనాతన ధర్మం లెప్రసీ, హెచ్‌ఐవీ తరహా రోగమని, సామాజిక రుగ్మతతో ముడిపడిందని వ్యాఖ్యానించారు.
బీజేపీ దాడి ముమ్మరం...
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ డీఎంకే నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ తమ దాడిని ఉధృతం చేసింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ల నాలుకలు ఊడలాగాలని, కళ్లు ఊడబెరకాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో షెకావత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తుల రాజకీయ హోదా, అధికారాన్ని తాము సవాలు చేస్తామని హెచ్చరించారు.
Updated Date - 2023-09-12T19:49:34+05:30 IST