Hunger Deaths : పక్కింట్లో ఆకలి కేకలు గుర్తించలేని అభివృద్ధి మనది!?
ABN, First Publish Date - 2023-02-15T18:07:53+05:30
టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రపంచం కుగ్రామమైపోయిందని అందరం సంతోషిస్తున్నాం, కానీ పక్కింట్లోని పొయ్యిలో ఉన్న పిల్లి లేచిందో,
న్యూఢిల్లీ : టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రపంచం కుగ్రామమైపోయిందని అందరం సంతోషిస్తున్నాం, కానీ పక్కింట్లోని పొయ్యిలో ఉన్న పిల్లి లేచిందో, లేదో తెలుసుకోలేకపోతున్నాం. కాంక్రీటు అరణ్యాలుండే పట్టణాల్లో మాత్రమే కాకుండా ఆత్మీయతలకు నెలవైన పల్లెలకు కూడా ఈ జాఢ్యం పాకింది. తమిళనాడులోని గోపిశెట్టి పాళయం, వండిపేట కుమరన్ వీథిలో ఇద్దరు వృద్ధులు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు వదలడం, మరో వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో కుమిలిపోవడం మానవతావాదులను కలవరపరుస్తోంది. ప్రతి రోజూ పలుకరించేవారు కనీసం కనిపించడం లేదేమిటని చుట్టుపక్కల ఉన్నవారిలో ఎవరు చొరవ తీసుకున్నా ఈ దారుణం జరిగి ఉండేది కాదు. ఈ నేపథ్యంలో మన దేశంలో ఆకలి చావులు, పేదరికం గురించి ఓసారి పరిశీలిద్దాం.
మన దేశంలో మరణాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. కానీ ఆకలి బాధతో ఎందరు మరణించారనే విషయాన్ని మాత్రం స్పష్టంగా పేర్కొనడం లేదు. 2020-21 సాగు సంవత్సరంలో అంతకుముందు కన్నా 3.74 శాతం వృద్ధితో 308.65 మిలియన్ టన్నుల ఆహారం మన దేశంలో ఉత్పత్తి అయింది. అయినప్పటికీ ఆకలి రేటు ఆందోళన కలిగిస్తూనే ఉంది. లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన ఓ అద్యయన నివేదిక ప్రకారం, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బిహార్, అస్సాం రాష్ట్రాల్లో ఆకలి, పోషకాహార లోపం అత్యధిక స్థాయుల్లో ఉన్నాయి. ఫలితంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. పోషకాహార లోపంతోపాటు మితిమీరిన ఆహారం కూడా సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. శిశు మరణాల్లో 69 శాతానికి కారణం పోషకాహార లోపం అని వెల్లడైంది.
ఆహారం వృథా
ఫుడ్ వేస్ట్ ఇండెక్స్, 2021 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 931 మిలియన్ టన్నుల ఆహారం వృథా అయింది. దీనిలో 61 శాతం ఆహారం ఇళ్ల ద్వారా, 26 శాతం ఆహారం ఫుడ్ సర్వీసెస్‌లో, 13 శాతం ఆహారం రిటెయిల్ రంగంలో వృథా అయింది. ఆహారాన్ని వృథా చేయడంలో చైనా అగ్ర స్థానంలో ఉంది. సంవత్సరానికి ప్రతి వ్యక్తి 64 కిలోగ్రాముల ఆహారాన్ని వృథా చేస్తున్నాడు. అంటే చైనాలో 9,16,46,213 టన్నుల ఆహారం ప్రతి సంవత్సరం వృథా అవుతోంది. అమెరికాలో ప్రతి వ్యక్తి సంవత్సరానికి 59 కిలోగ్రాముల ఆహారాన్ని వృథా చేస్తున్నారు, అంటే దేశవ్యాప్తంగా సంవత్సరానికి 1,93,59,951 టన్నుల ఆహారం వృథా అవుతోంది. భారత దేశంలో ప్రతి వ్యక్తి సంవత్సరానికి 50 కేజీల ఆహారాన్ని వృథా చేస్తున్నారు, అంటే దేశవ్యాప్తంగా సంవత్సరానికి 6,87,60,163 టన్నుల ఆహారం వృథా అవుతోంది.
ఆకలి చావు అంటే...?
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కేవలం ఆరు నెలల్లో మరణించడంపై జార్ఖండ్ హైకోర్టు 2020లో స్వీయ విచారణ జరిపింది. అసలు ఆకలి చావు అంటే ఏమిటి? ఆకలి వల్ల వాస్తవంగా చనిపోయినవారు ఎందరు? అని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే సాధారణంగా చెప్పుకునేదాని ప్రకారం, అవసరమైన మౌలిక పోషకాలను కలిగియున్న ఆహారాన్ని తినడానికి తగిన శారీరక సామర్థ్యం కానీ, ఆర్థిక స్తోమత కానీ లేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఆకలితో ఉన్నట్లు చెబుతారు. ఆహారాన్ని తినకపోవడం వల్ల కలిగే అసౌకర్యాన్ని ఆకలి అంటారు.
కేంద్ర ప్రభుత్వ వాదన
ప్రపంచ ఆకలి సూచీ (Global Hunger Index) 2022లో 121 దేశాల్లో మన దేశం 107వ స్థానంలో ఉందని చెప్తోంది. అయితే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో, ఈ సూచీ మన దేశ వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని తెలిపారు. ‘ఆకలి’ని నిర్వచించిన విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. దీనిని పైపైన చూసి, విలువను ఆపాదించకూడదన్నారు. ఈ సూచీ కోసం తీసుకున్న నాలుగింటిలో కేవలం పోషకాహార లోపం మాత్రమే ఆకలికి సంబంధించినదని తెలిపారు. స్టంటింగ్, వేస్టింగ్ వంటివాటికి వేరే కారణాలు ఉంటాయన్నారు. నాలుగోది అయిన బాలల మరణాలు ఆకలివల్ల సంభవిస్తాయనడానికి ఆధారాలేవీ లేవన్నారు.
ఉచిత రేషన్ పథకాలు
కోవిడ్ మహమ్మారి వల్ల ఇబ్బందుల్లో పడిన నిరుపేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని 2020 మార్చి 26న ప్రకటించింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని సుమారు 81 కోట్ల మందికి అందజేస్తోంది. ఈ పథకం క్రింద అర్హతగల ప్రతి వ్యక్తికి నెలకు 5 కేజీల బియ్యం లేదా గోధుమలు, ప్రతి కుటుంబానికి నెలకు ఒక కేజీ పప్పు అందిస్తోంది. అంత్యోదయ అన్న యోజన ద్వారా కూడా రాయితీ ధరలకు ఆహార ధాన్యాలను ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాయితీ ధరకు రేషన్ సరుకులను అందజేస్తున్నాయి.
అవినీతి
రేషన్ సరుకులను ఉచితంగా కానీ, రాయితీతో కానీ అందజేసే పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నప్పటికీ, అట్టడుగు స్థాయికి చేరేసరికి అవినీతి రాజ్యమేలుతోంది. అసలైన అర్హులకు సక్రమంగా అందడం లేదు. ఈ సరుకులను తీసుకుని, కొంచెం ఎక్కువ ధరకు హోటళ్లు, ఇతర వ్యాపారస్తులకు అమ్ముకునేవారు చాలా మంది కనిపిస్తున్నారు. అందుకే కడుపు కాలిపోతున్నా రెండు మెతుకులు దొరకనివారు ఆకలికి బలైపోతున్నారు.
వేలాది మందితో నిత్యం టచ్‌లో...
ప్రస్తుతం వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్కరూ వేలాది మందితో అనుబంధం ఏర్పరచుకుంటున్నారు. నిత్యం అనేక అంశాలపై చర్చోపచర్చలు జరుపుతున్నారు. కొన్ని గ్రూపుల్లో ఇతరులకు సాయపడే దాతలు కనిపిస్తున్నారు. కానీ అటువంటి సాధనాలు నిరుపేదలకు అందుబాటులో ఉండటం లేదు. వీరి కష్టాల గురించి తెలుసుకునే నాథుడే కరువయ్యాడు.
ఇవి కూడా చదవండి :
బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఐ-టీ సర్వేపై కేజ్రీ ఘాటు స్పందన
RSS chief Mohan Bhagwat : మోహన్ భగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
Updated Date - 2023-02-15T18:07:56+05:30 IST