India : నూతన విదేశీ వాణిజ్య విధానం ఆవిష్కరణ... భారీ ఎగుమతులే లక్ష్యం...
ABN, First Publish Date - 2023-03-31T14:50:40+05:30
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ నూతన విదేశీ వాణిజ్య విధానాన్ని ఆవిష్కరించారు.
న్యూఢిల్లీ : భారత దేశం శుక్రవారం అత్యంత క్రియాశీలక, అవసరానికి తగినట్లుగా ఉండే విదేశీ వాణిజ్య విధానం (FTP)ని ఆవిష్కరించింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. 2030నాటికి 2 ట్రిలియన్ డాలర్ల విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం దీనిని రూపొందించింది. ఈ విధానానికి కాలపరిమితి లేదు. లావాదేవీలను డాలర్లలో కాకుండా రూపాయిలలో నిర్వహించడాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించడం విశేషం.
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) ఈ నూతన విదేశీ వాణిజ్య విధానాన్ని ఆవిష్కరించారు. ఇది అత్యంత క్రియాశీలకమైనదని, చంచలమైన గ్లోబల్ మార్కెట్ల అవసరానికి తగినట్లు స్పందించే గుణం ఈ విధానానికి ఉన్నట్లు తెలిపారు. వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో సమస్యలను పరిష్కరించేందుకు సంప్రదింపులు జరిపే విదానాన్ని కొనసాగిస్తామన్నారు. క్షేత్ర స్థాయి నుంచి ఎగుమతులను ప్రోత్సహిస్తామని, ఈ సందర్భంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో రాష్ట్రాలు, జిల్లాల భాగస్వామ్యాన్ని పెంచుతామని అన్నారు. ఎగుమతులను ప్రోత్సహించడం కోసం రాయితీలపై భారత దేశం ఆధారపడదన్నారు. ఉన్నత లక్ష్యాల సాధన కోసం శక్తి, సామర్థ్యాలను పెంచుకుంటామన్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, 2022-23లో వస్తువులు, సేవల ఎగుమతులు 760 బిలియన్ డాలర్లు దాటే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ, ఈ విధానం చాలా ఆసక్తికరమైనదని, దీనికి ఐదేళ్ల కాలపరిమితి లేదని చెప్పారు. ప్రస్తుత 2015-20 విదేశీ వాణిజ్య విధానం 2023 మార్చి 31తో ముగిసింది. కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో 2015-20 విధానాన్ని కొనసాగించాలని పారిశ్రామిక రంగం కోరింది. దీంతో దీనిని పొడిగిస్తూ వచ్చారు.
ఇవి కూడా చదవండి :
Digvijaya Vs Kapil : దిగ్విజయ సింగ్‌పై కపిల్ సిబల్ ఆగ్రహం
Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్ రెండో వీడియో... లొంగుబాటు, ప్రాణ భయంపై వివరణ...
Updated Date - 2023-03-31T14:50:40+05:30 IST