G20 summit : జీ20 దేశాధినేతల కోసం స్ట్రీట్ ఫుడ్, చిరుధాన్యాల తినుబండారాలు!
ABN, First Publish Date - 2023-09-03T12:53:31+05:30
అభివృద్ధి చెందిన, చెందుతున్న 20 దేశాల కూటమి సమావేశానికి దేశ రాజధాని నగరం చకచకా ముస్తాబవుతోంది. ప్రగతి మైదానంలో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే సమావేశాల్లో పాల్గొనే వివిధ దేశాల నేతలు, అధికారులకు రుచికరమైన భారతీయ స్ట్రీట్ ఫుడ్అం దించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
న్యూఢిల్లీ : అభివృద్ధి చెందిన, చెందుతున్న 20 దేశాల కూటమి సమావేశానికి దేశ రాజధాని నగరం చకచకా ముస్తాబవుతోంది. ప్రగతి మైదానంలో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే సమావేశాల్లో పాల్గొనే వివిధ దేశాల నేతలు, అధికారులకు రుచికరమైన భారతీయ స్ట్రీట్ ఫుడ్, చిరుధాన్యాలతో తయారు చేసిన తినుబండారాలను అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో లభించే నోరూరించే స్ట్రీట్ ఫుడ్ కూడా ఈ తినుబండారాల్లో ఉంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండే చిరు ధాన్యాలతో చేసిన వంటకాలను దేశాధినేతలకు, వారితోపాటు వచ్చే అధికార బృందాలకు రుచి చూపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వాతావరణానికి తగినట్లుగా, అత్యుత్తమ స్థాయి పోషక విలువలతో కూడిన తినుబండారాలను సిద్ధం చేస్తున్నారు.
ఇదిలావుండగా, జీ20 సదస్సు పది కాలాలపాటు గుర్తుండిపోయే విధంగా జీ20 తోటను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనే వివిధ దేశాల నేతలు తమ తమ దేశాలకు చెందిన ఓ మొక్కను ఈ తోటలో నాటబోతున్నారు. ఈ సదస్సు జరిగే భరత మండపం ప్రాంగణంలో ఈ తోటను పెంచుతారు.
ఈ సమావేశాల్లో పాల్గొనే వివిధ దేశాల నేతల భర్త(లు) లేదా భార్య(లు) కూడా భారత దేశ సందర్శనను మధురజ్ఞాపకంగా గుర్తుంచుకోవడానికి వీలుగా మన దేశంలోని సుప్రసిద్ధ హస్తకళలపై ప్రదర్శనలు నిర్వహిస్తారు. అదేవిధంగా షాపింగ్ కోసం నేషనల్ గేలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌కు తీసుకెళ్తారు.
జీ20 ఇండియా ప్రత్యేక కార్యదర్శి ముక్తేశ్ పర్దేశి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఇండియన్ స్ట్రీట్ ఫుడ్‌ను సృజనాత్మకంగా పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా మన దేశంలోని స్థానిక, ప్రాంతీయ రుచికరమైన వంటకాలను కూడా వడ్డిస్తామన్నారు. మెనూను ఖరారు చేయడం కోసం చెఫ్స్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని వీరు తినుబండారాలను, ఆహార పదార్థాలను తయారు చేస్తారన్నారు. ప్రపంచ నేతలు బస చేసే హోటళ్లు వినూత్నమైన, సృజనాత్మకమైన పద్ధతుల్లో రకరకాల చిరుధాన్యాల వంటకాలను తయారు చేయడంలో పోటీ పడుతున్నాయని చెప్పారు.
ఈ సమావేశాల్లో పాల్గొనే వివిధ దేశాల నేతలకు, ప్రతినిధి బృందాలకు ఇవ్వబోయే బహుమతులపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. ముఖ్యంగా మన దేశంలోని హస్త కళలు, టెక్స్‌టైల్, చిత్రకళ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ బహుమతుల్లో ఆత్మీయత కనబడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారన్నారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన సందేశం ప్రతిబింబించే విధంగా బహుమతులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
DMK : సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిది : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్
Rahul Gandhi: దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిన బీజేపీ: రాహుల్
Updated Date - 2023-09-03T12:53:31+05:30 IST