Akilesh Yadav: అలా జరిగుంటే భారత్ ప్రపంచ కప్ గెలిచేది.. అఖిలేష్ ఆసక్తికర కామెంట్స్
ABN, First Publish Date - 2023-11-22T11:25:14+05:30
Cricket: క్రికెట్ ప్రపంచ కప్(Cricket World Cup - 2023) లో భారత్ ఓటమిపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్(Akilesh Yadav) యాదవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
లఖ్ నవూ: క్రికెట్ ప్రపంచ కప్(Cricket World Cup - 2023) లో భారత్ ఓటమిపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్(Akilesh Yadav) యాదవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) లోని ఇటావా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్ లఖ్ నవూలో జరిగి ఉంటే భారత్ తప్పకుండా గెలిచేదని ఆయన వ్యాఖ్యానించారు.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మ్యాచ్ జరిగినందుకే భారత్ ఓడిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై పరోక్షంగా విమర్శలు చేశారు. "లఖ్ నవూలో మ్యాచ్ జరిగి ఉంటే టీం ఇండియాకు విష్ణు దేవుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆశీస్సులు లభించేవి. లఖ్ నవూలో ఉన్న క్రికెట్ స్టేడియానికి గతంలో సమాజ్ వాదీ పార్టీ ఎకనా స్టేడియం అని పేరు పెట్టింది.
విష్ణుమూర్తికి ఉన్న పేర్లలో ఎకనా ఒకటి. గుజరాత్ లో కాకుండా లఖ్ నవూలో మ్యాచ్ జరిగుంటే గెలుపు నల్లేరు మీద నడకే అయ్యేది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కొన్ని పిచ్ సమస్యలున్నాయి. దీంతో ఓటమి ఎదురైంది" అని అఖిలేష్ కామెంట్స్ చేశారు. నిన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం భారత్ ఓటమిపట్ల స్పందించారు.
స్టేడియంలోకి చెడు శకునం(పనౌతీ) వచ్చాడు. అంతే! అప్పటి వరకు గెలిచి తీరుతుందని అనుకున్న టీమిండియా ఓడింది’’ అని రాహుల్ గాంధీ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)పై విమర్శలు గుప్పించారు. ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మంగళవారం రాజస్థాన్‌లోని జాలోర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన రాహుల్ గాంధీ(Rahul Gandhi).. ప్రధాని మోదీని ‘చెడు శకునం’తో పోల్చారు. అంతేకాదు, ఆయనే ఈ ఓటమికి కారణమని వ్యాఖ్యానించారు.
‘‘మన కుర్రాళ్లు దాదాపు ప్రపంచ కప్‌ను గెలిచినంత పనిచేశారు. కానీ, ‘చెడు శకునం’ వారిని ఓడిపోయేలా చేసింది’’ అని రాహుల్ అన్నారు. దేశంలో ఓబీసీ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ వారి అభివృద్ధికి కేంద్రం చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. ఓబీసీ ప్రతినిధినని చెప్పుకొనే ప్రధాని మోదీ వారికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. వన్డే ప్రపంచ కప్‌లో ఓటమి భారంతో ఉన్న టీమిండియాకు మోదీ డ్రస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో మంగళవారం వెలుగు చూసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ‘‘భారత్‌లో ఆయనో.. డ్రామా మాస్టర్’’ అని వ్యాఖ్యానించింది. రాహుల్ కామెంట్స్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-11-22T11:25:16+05:30 IST