India : ‘ఇండియా’ పేరుపై హక్కు పాకిస్థాన్‌దేనా?
ABN, First Publish Date - 2023-09-06T10:48:55+05:30
మన దేశం పేరును ‘భారత్’గా పునరుద్ధరించబోతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ‘ఇండియా’ పేరుపై హక్కును పాకిస్థాన్ కోరుతుందా? అనే అంశం తెరపైకి వచ్చింది.
న్యూఢిల్లీ : మన దేశం పేరును ‘భారత్’గా పునరుద్ధరించబోతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ‘ఇండియా’ పేరుపై హక్కును పాకిస్థాన్ కోరుతుందా? అనే అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుత పాకిస్థాన్ అత్యధికంగా ఇండస్ రీజియన్‌లోనే ఉండటంతో ఈ పేరుపై హక్కు పాకిస్థాన్‌దేననే వాదన వినిపిస్తోంది. సౌత్ ఆసియా ఇండెక్స్ ఇచ్చిన ట్వీట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించింది.
జీ20 సదస్సుకు హాజరయ్యే వివిధ దేశాల అగ్ర నేతల గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఈ నెల 9న విందు ఇవ్వబోతున్నారు. దీని కోసం రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాశారు. అదేవిధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు సంబంధించిన పత్రాల్లో కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని రాశారు. జీ20 సదస్సు కోసం రూపొందించిన పుస్తకంలో కూడా మన దేశాన్ని భారత్ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మన దేశం పేరును గతంలో మాదిరిగానే భారత్ అని మార్చబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
సౌత్ ఆసియా ఇండెక్స్ ఇచ్చిన ట్వీట్‌లో, ‘ఇండియా’ పేరును ఐక్యరాజ్య సమితి స్థాయిలో అధికారికంగా వదులుకుంటే, ఈ ‘ఇండియా’ పేరుపై హక్కును పాకిస్థాన్ కోరవచ్చునని తెలిపింది. ఇండియా అంటే ఇండస్ రీజియన్‌ను తెలియజేస్తుందని, ఈ రీజియన్‌లో ప్రస్తుత పాకిస్థాన్ ఉందని తెలిపింది.
సౌత్ ఆసియా ఇండెక్స్ అంతకుముందు ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశం పేరును ఇండియా నుంచి భారత్ అని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపింది. వలస పాలకుల కాలంనాటి ఆనవాళ్లను తొలగించడం కోసం ఈ విధంగా పేరును మార్చుతున్నట్లు తెలిపింది. ‘భారత్’ అనే పేరుకు సంస్కృత మూలాలు ఉన్నట్లు తెలిపింది. అయితే భారత ప్రభుత్వం అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు.
కొత్తగా ఏర్పాటైన భారత దేశానికి ‘ఇండియా’ అని బ్రిటిష్ ఇండియా పేరు పెట్టడాన్ని పాకిస్థాన్ నేత మహమ్మద్ అలీ జిన్నా వ్యతిరేకించారని సౌత్ ఆసియా ఇండెక్స్ తెలిపింది. ఈ దేశానికి హిందుస్థాన్ అని కానీ, భారత్ అని కానీ పేరు పెట్టాలని జిన్నా కోరారని తెలిపింది. 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఒక నెల తర్వాత ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు గౌరవాధ్యక్షునిగా ఉండాలని జిన్నాను లూయిస్ మౌంట్‌బాటన్ ఆహ్వానించారు. దీనిని జిన్నా తిరస్కరించారు. ఈ ఆహ్వాన పత్రికలో హిందుస్థాన్‌కు బదులుగా ఇండియా అని ఉపయోగించినందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జిన్నా మౌంట్‌బాటన్‌కు రాసిన లేఖలో, హిందుస్థాన్ అంతుబట్టని కారణాలతో ‘ఇండియా’ అనే పదాన్ని స్వీకరించిందని, ఇది కచ్చితంగా తప్పుదోవపట్టించేదేనని తెలిపారు. అయోమయాన్ని సృష్టించే ఉద్దేశంతోనే ‘ఇండియా’ పేరును స్వీకరించారని వ్యాఖ్యానించారు.
మాజీ లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ స్పందిస్తూ, మన దేశం అసలు పేరు ‘భారత్’ అని, దీనిని ‘ఇండియా’ అని పిలవడం ప్రారంభించినవారు బ్రిటిషర్లేనని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Rahul Gandhi : యూరోప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ?
Union Minister: కేంద్రమంత్రిపై పరువునష్టం దావా రద్దుకు హైకోర్టు నిరాకరణ
Updated Date - 2023-09-06T11:13:55+05:30 IST