Manish Sisodia: జైలు నుంచి ఇంటికి సిసోడియా.. 6 గంటల పాటు కోర్టు అనుమతి
ABN, First Publish Date - 2023-11-11T14:42:55+05:30
లిక్కర్ కుంభకోణంలో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారంనాడు కోర్టు అనుమతితో తన నివాసానికి వెళ్లారు. న్యూరోలాజికల్ సమస్యతో బాధపడుతున్న భార్యను చూసేందుకు, 6 గంటల సేపు అక్కడ ఉండేందుకు సిటీ కోర్టు ఆయనకు అనుమతినిచ్చింది.
న్యూఢిల్లీ: లిక్కర్ కుంభకోణం (Liquor Scam)లో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) శనివారంనాడు కోర్టు అనుమతితో తన నివాసానికి వెళ్లారు. న్యూరోలాజికల్ సమస్యతో బాధపడుతున్న భార్యను చూసేందుకు, 6 గంటల సేపు అక్కడ ఉండేందుకు సిటీ కోర్టు ఆయనకు అనుమతినిచ్చింది. దీంతో పోలీసు ఎస్కార్టుతో జైలు వ్యానులో ఉదయం 10 గంటలకు మధుర రోడ్డులోని తన నివాసానికి ఆయన చేరుకున్నారు. సిసోడియా తన భార్యను కలుసుకునేందుకు కోర్టు కఠిన షరతులు విధించింది. మీడియాతో మాట్లాడరాదని, ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనరాదని, మధ్యాహ్నం 4 గంటలకల్లా జైలుకు తిరిగిరావాలని కోర్టు ఆదేశించింది.
సిసోడియా భార్య సీమ కొంతకాలంగా మల్టిపుల్ స్క్లిరోసిస్‌తో బాధపడుతున్నారు. మెదడు, వెన్నుముకపై ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గత జూన్‌లో సీమ సిసోడియా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్చారు. కోర్టు అనుమతితో ఆయన ఇంటికి చేరుకునే సరికే ఆమె ఆసుపత్రిలో చేరడంతో ఆయన జైలుకు వెనుదిరిగారు. లిక్కర్ స్కామ్‌లో గత ఫిబ్రవరిలో సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. అప్పట్నించి ఆయన తీహార్ జైలులోనే రిమాండులో ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను కనిపెట్టుకుని చూసుకునేందుకు ఎవరూ లేనందున బెయిలు మంజూరు చేయాలని ఆయన చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు నిరాకరించింది.
Updated Date - 2023-11-11T14:42:57+05:30 IST