Jairam Ramesh: ‘ఇండియా’ ప్రధాని అభ్యర్థిపై జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు.. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకం
ABN, Publish Date - Dec 27 , 2023 | 08:56 PM
‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న ఎప్పటినుంచో మిస్టరీగానే ఉంది. అయితే.. ఇటీవల జరిగిన ఇండియా కూటమి నాల్గవ సమావేశంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ ప్రతిపాదన...
Jairam Ramesh On INDIA PM Face: ‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న ఎప్పటినుంచో మిస్టరీగానే ఉంది. అయితే.. ఇటీవల జరిగిన ఇండియా కూటమి నాల్గవ సమావేశంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ ప్రతిపాదన చేశారు. ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని ప్రధానమంత్రిగా చేయాలని ప్రస్తావించారు. ఇందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్దతు తెలిపారు. కానీ.. కొందరు మాత్రం ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా గళమెత్తారు. వారిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఒకరు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కరాఖండీగా తేల్చి చెప్పారు.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శరద్ పవార్‌తో ఏకీభవిస్తూ.. ఎన్నికలు ముగిసిన తర్వాతే ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను శరద్ పవార్‌తో ఏకీభవిస్తున్నాను. ప్రధాని పదవికి సంబంధించిన అభ్యర్థిని తక్షణమే ప్రకటించకూడదని కాంగ్రెస్ ఎప్పటినుంచో విశ్వసిస్తోంది. భారతదేశంలో రాష్ట్రపతి వ్యవస్థ లేదు. ముందుగా మేము ప్రధాని అభ్యర్థిని నిర్ణయించుకోము. ముందైతే ఎన్నికలు జరగనివ్వండి. ఫలితాలు వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటాం’’ అని జైరాం రమేశ్ చెప్పుకొచ్చారు. పోనీ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ అభ్యర్థిగా ఉండాలా? అని ప్రశ్న అడిగినప్పుడు.. ఆయన తన సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు.
మరోవైపు.. ఇండియా కూటమికి పీఎం అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గేను ప్రతిపాదించాలని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ అధినేత నితీష్ కుమార్ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే.. ఈ వార్తల్ని ఆయన కొట్టిపారేశారు. తనకు ఎలాంటి పదవిపై కోరిక లేదని స్పష్టం చేశారు. అటు.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా ఈ విషయంలో తన వైఖరిని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనను తోసిపుచ్చిన ఆయన.. ముందుగా ఎన్నికల్లో గెలుపుపైనే తాము దృష్టి సారించామని చెప్పారు. ఫలితాల తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
Updated Date - Dec 27 , 2023 | 08:56 PM