North Korea : జపాన్ దీవిలోకి దూసుకెళ్లిన ఉత్తర కొరియా క్షిపణి
ABN, First Publish Date - 2023-02-18T17:19:23+05:30
ఉత్తర కొరియా శనివారం ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ (ICBM)ను ప్రయోగించిందని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
టోక్యో : ఉత్తర కొరియా శనివారం ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ (ICBM)ను ప్రయోగించిందని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది తమ ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఒషిమా దీవికి సమీపంలో హొక్కయిడోకు 200 కిలోమీటర్ల దూరంలో పడినట్లు పేర్కొంది. ఐసీబీఎం క్లాస్ క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించడం గత నవంబరు తర్వాత ఇదే తొలిసారి.
ఉత్తర కొరియా శనివారం ప్రయోగించిన ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ (ICBM) దాదాపు 900 కిలోమీటర్లు ప్రయాణించినట్లు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ప్రయాణించడానికి 66 నిమిషాలు పట్టిందని తెలిపింది. ఇది పొరుగు దేశాల మీదుగా ప్రయాణించకూడదనే ఉద్దేశంతో దీనిని నిలువుగా పైకి ప్రయోగించారని తెలిపింది.
జపాన్ (Japan) వెల్లడించిన సమాచారాన్ని దక్షిణ కొరియా (South Korea) కూడా ధ్రువీకరించింది. జనవరి ఒకటిన లాంగ్ రేంజ్ మిసైల్‌ను ఉత్తర కొరియా (North Korea) ప్రయోగించిందని, ఆ తర్వాత అటువంటి మిసైల్‌ను ప్రయోగించడం ఇదే మొదటిసారి అని తెలిపింది. ప్యాంగ్యాంగ్ (ఉత్తర కొరియా రాజధాని)లోని సునన్ ప్రాంతం నుంచి దీనిని ప్రయోగించిందని తెలిపింది.
ఉత్తర కొరియా అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగియుందనే ఊహాగానాల నేపథ్యంలో అమెరికా (America), దక్షిణ కొరియా వచ్చే వారం వాషింగ్టన్‌లో మిలిటరీ డ్రిల్స్ నిర్వహించబోతున్నాయి. అయితే ఈ రెండు దేశాలు కలిసి తమపై దాడి చేయడానికి రిహార్సల్ చేస్తున్నాయని ఉత్తర కొరియా అభిప్రాయపడుతోంది. మునుపెన్నడూ లేని స్థాయిలో గట్టి సమాధానం చెబుతామని శుక్రవారం శపథం చేసింది.
జపాన్ రక్షణ మంత్రి తొషిరో ఈనో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, తమ దేశ ప్రజల జీవితాలు, ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. దీని కోసం తాము అమెరికా, తదితర దేశాలతో కలిసి పని చేస్తామన్నారు. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, విశ్లేషిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి :
Indian Army : పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న భారత సైనికుడు!
Opposition Unity : ‘ఐ లవ్ యూ’ చెప్పేదెవరు : కాంగ్రెస్
Updated Date - 2023-02-18T17:19:27+05:30 IST