Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందన.. ఏమన్నారంటే....
ABN, First Publish Date - 2023-06-04T11:05:58+05:30
ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురై, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రగాఢ సంతాపం తెలిపారు
వాషింగ్టన్ : ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురై, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) స్పందించారు. మరణించినవారికి ప్రగాఢ సంతాపం తెలిపారు. 280 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు వచ్చిన వార్తలు తన మనసును తీవ్రంగా కలచివేశాయని అన్నారు. ఆత్మీయులను కోల్పోయినవారికి, గాయపడినవారికి సంఘీభావంగా తాము ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటనలో, ‘‘భారత దేశంలో భయానక రైలు ప్రమాదం జరిగినట్లు విషాదకర వార్త తెలియడంతో అమెరికా ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్, నేను తీవ్రంగా కలతచెందాం. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయినవారి కోసం, గాయపడినవారి కోసం మేము ప్రార్థిస్తున్నాం’’ అని బైడెన్ తెలిపారు. అమెరికా, భారత దేశం మధ్య పటిష్ట సంబంధాలు ఉన్నాయన్నారు. కుటుంబ సంబంధాలు, సంస్కృతులలో ఈ సంబంధాలు లోతుగా పాతుకుపోయాయని చెప్పారు. ఈ సంబంధాలే ఇరు దేశాలను ఏకం చేస్తున్నాయని చెప్పారు. ఈ విషాదకర దుర్ఘటనపట్ల భారతీయులతోపాటు యావత్తు అమెరికన్లు విచారంతో ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదం నుంచి కోలుకోవడం కోసం చర్యలు కొనసాగుతున్న సమయంలో భారతీయులకు సంఘీభావంగా నిలుస్తామన్నారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా, బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం మూడు రైళ్లు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్(Coromandel Express), బెంగుళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో 288 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 1,100 మంది గాయపడ్డారు. గాయపడినవారికి చికిత్స చేయడం కోసం రక్తం అవసరమవుతుందనే ఉద్దేశంతో స్థానికులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున, గాయపడినవారికి రూ.2 లక్షలు చొప్పున, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేల చొప్పున చెల్లిస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చెల్లిస్తామని మోదీ ప్రకటించారు. ఇక్కడ సహాయక చర్యలు పూర్తయ్యాయని, ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత సైన్యం, ఒడిశా విపత్తు స్పందన దళం (ODRAF), జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) , స్థానికులు సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Rajastan : బహిరంగ సభలో మైక్‌ను నేలకేసి కొట్టిన సీఎం గెహ్లాట్.. కారణం ఏంటో తెలుసా...
Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై మోదీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు
Updated Date - 2023-06-04T11:35:52+05:30 IST