Jammu and Kashmir: జోషిమఠ్ తరహాలో కుంగుతున్న భూమి, ఇళ్లకు పగుళ్లు
ABN, First Publish Date - 2023-02-03T17:21:13+05:30
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ ఉత్పాతం ఇప్పుడు జమ్మూకశ్మీర్‌కూ విస్తరించింది. దోడా జిల్లాలోని టటరీ మున్సిపాలిటీకి చెందిన...
శ్రీనగర్: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ (Joshimath) ఉత్పాతం ఇప్పుడు జమ్మూకశ్మీర్‌కూ (Jammu and Kashmir) విస్తరించింది. దోడా (Doda) జిల్లాలోని టటరీ (Tathri) మున్సిపాలిటీకి చెందిన నయీ బస్తీ ఏరియాలో భూమి కుంగిపోవడం (Land Sinking) మొదలైంది. ఫలితంగా సుమారు 20 ఇళ్లు, ఒక మసీదు బీటలు వారాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురమవుతున్నారు. సుమారు 19 కుటుంబాలను తాత్కాలిక శిబిరాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. భూమి కుంగిపోతుండటంతో ఇళ్లు బీటలు వారుతున్నాయని, దీనికి కారణం తెలుసుకునేందుకు నిపుణులను రప్పిస్తున్నామని చెప్పారు.
కాగా, గురువారం అర్ధరాత్రి భారీగా కొండచరియలు విరిగిపడటంతో సుమారు 50 నుంచి 60 కుటుంబాల వారు భయాందోళనలకు గురయ్యారు. రోడ్ల నిర్మాణం వంటి పనుల కోసం యంత్రాలను వాడుతుండటంతో కొండచరియలు తరచు జారి పడుతున్నాయంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని దోడా డిప్యూటీ కమిషనర్ విశేష్ మహాజన్ భరోసా ఇచ్చారు.
నయీ బస్తీ గ్రామంలో సుమారు 50 కుటుంబాలు ఉన్నాయని, బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు భూమి కుంగిపోవడానికి కారణాలపై విచారణ చేపడుతున్నట్టు టటరీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అథర్ అమీన్ తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో పరిస్థితితో దోడా జిల్లాలో పరిస్థితిని పోల్చడం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నయీ బస్తీ పరిస్థితిని జోషిమఠ్‌తో పోల్చడం అతిశయోక్తి అవుతుందన్నారు. ఇక్కడ కొండచరియల సమస్య ఉందని, చెనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్టు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన జియోలజిస్టులు బాధిత ప్రాంతాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కాగా, బాధితుల్లో కొందరిని తాత్కాలిక శిబిరాలకు తరలించగా, మరికొందరు తమ బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు.
కాగా, కొండ ప్రాంత గ్రామం కావడంతో రోడ్ల నిర్మాణం, నీటి కాలువల నిర్మాణాలకు యంత్రాలు వాడకంతో భూమి కుంగిపోతూ, ఇళ్లు బీటలు వారుతున్నట్టు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదిహేనేళ్లుగా తాను ఈ గ్రామంలోనే ఉంటున్నానని, కాంక్రీట్ ఇళ్లు కూడా బీటలు వారడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తాత్కాలిక శిబిరానికి షిప్ట్ అయిన స్థానిక మహిళ జహేదా బేగం తెలిపింది. గ్రామంలో 50కి పైగా ఇళ్లు ఉన్నాయని, గురువారం కొండచరియలు విరిగిపడిన తర్వాతే ఎక్కువ ఇళ్ల బీటలు తీశారమని చెప్పింది. నయీ బస్తీ ఏర్పడి 20 ఏళ్లయిందని, ఇంతవరకూ భూమి కుంగిపోవడం, ఇళ్లు బీటలు వారడం వంటి సమస్యలు రాలేదని మరో స్థానికుడు తెలిపాడు. బాధిత ప్రజలను స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని కోరాడు.
Updated Date - 2023-02-03T17:21:14+05:30 IST