Justice Chandru: గవర్నర్‌కు ఆమాత్రం చట్టం తెలియదా?
ABN, First Publish Date - 2023-11-24T07:35:56+05:30
తమిళనాడు గవర్నర్ అవలంబిస్తున్న వైఖరిని చూసి ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రూ(Justice Chandru) వ్యాఖ్యానించారు.
- రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రూ
అడయార్(చెన్నై): తమిళనాడు గవర్నర్ అవలంబిస్తున్న వైఖరిని చూసి ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రూ(Justice Chandru) వ్యాఖ్యానించారు. గవర్నర్ ఒక పోస్ట్‌మేన్ అని, అది ఒక గౌరవ ప్రదమైన పదవి అని అన్నారు. సేలంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ... ‘చట్టం ఒక చీకటి గది.. అందులో న్యాయవాదుల వాదన దీపం’ వంటిది అని దివంగత అన్నాదురై అనేవారని గుర్తు చేశారు. ‘‘రాష్ట్ర గవర్నర్‌కు చట్టం తెలియదా? తెలియకుంటే అడిగి తెలుసుకునేందుకు మనుషులు లేరా? ఆయన వ్యవహారశైలి నవ్వుకునేలా ఉంది. శాసనసభలో చేసిన ముసాయిదాలను ఆమోదించడానికి ఆయనకు వచ్చిన కష్టమేంటి? సుప్రీంకోర్టులో రాష్ట్రప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత 10 ముసాయిదా బిల్లులను తిప్పి పంపించాలని కోర్టుకు చెప్పి చేతులు దులుపుకుంటారా? ముసాయిదా బిల్లులను వెనక్కి పంపితే, అసెంబ్లీ మళ్లీ ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపుతుంది. ఆ బిల్లులపై సంతకం చేయాల్సిందే. గవర్నర్‌కు సలహాలు ఇచ్చేందుకు న్యాయవాదులు లేరా? అర్హత, జ్ఞానం లేదా? చట్టం తెలియదా?’’ అని ప్రశ్నించారు. గత రెండేళ్లుగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్లందరూ ఇదే తరహాలో వ్యవహిరస్తున్నారని వాపోయారు. వీరి వెనుక ఓ శక్తి ఉందని, గవర్నర్ పదవి ఇపుడు అర్హతలేనిదిగా మారిపోయిందన్నారు. రెండేళ్లుగా నిద్రపోయి.. ఇప్పుడు ఎలా జ్ఞానం వచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ప్రశ్నించారని ఆయన గుర్తు చేశారు. గవర్నర్‌ను ఒక ఆయుధంగా ఉపయోగించి అధికారంలో ఉన్నవారిని ఇక్కట్లకు గురి చేస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయాలకు చాన్సలర్ అంటే రాజు కాదని, రాష్ట్రంలోని పది యూనివర్శిటీలకు త్వరలోనే ముఖ్యమంత్రే ఛాన్సలర్‌గా ఉంటారని జస్టిస్ చంద్రూ వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-11-24T07:35:58+05:30 IST