Karnataka Assembly elections: ప్రత్యక్ష రాజకీయాలకు కీలక నేత గుడ్‌బై ... వారికి అవకాశమిచ్చేందుకేనన్న సీఎం
ABN, First Publish Date - 2023-04-11T18:50:12+05:30
యువతరం కోసం సీనియర్లు రాజకీయాలనుంచి తప్పుకోవడం అనే గొప్ప సంస్కృతి బీజేపీలో ఉందని బొమ్మై చెప్పారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly elections) వేళ బీజేపీ(BJP) సీనియర్ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పడంపై కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై స్పందించారు. శివమొగ్గ(Shivamogga) నుంచి పోటీ చేయబోనంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (BJP National President JP Nadda) ఈశ్వరప్ప లేఖ రాశారని ధృవీకరించారు. యువతరం కోసం సీనియర్లు రాజకీయాలనుంచి తప్పుకోవడం అనే గొప్ప సంస్కృతి బీజేపీలో ఉందని బొమ్మై చెప్పారు. నిజానికి ఆయన పోటీ చేయబోనని గతంలోనే ప్రకటించినా పోటీ చేయాలని తాము కోరామన్నారు. అయితే ఆయన తన క్యాడర్‌తో మాట్లాడాక రాజకీయాలనుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారని బొమ్మై వెల్లడించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల జాబితా నేడు విడుదల కావొచ్చని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈశ్వరప్ప తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. నెల క్రితం ఆయన తాను ఈసారి శివమొగ్గనుంచి పోటీ చేయకపోవచ్చని చెప్పారు. అంతే కాదు ప్రజాసేవ చేయాలంటే ప్రజాప్రతినిధిగానే ఉండాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీలో తన కుమారుడు కంటేశ్‌కు, తనకు ఇద్దరికీ టికెట్లు అసాధ్యమని ఆయన ముందే గ్రహించారు. అందుకే కుమారుడి భవిష్యత్ కోసం ఆయన ప్రత్యక్ష రాజకీయాలనుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈశ్వరప్ప ప్రస్తుత వయసు 75 సంవత్సరాలు. అయితే 75 ఏళ్లకు పైబడినవారు రాజకీయాలనుంచి తప్పుకోవాలని బీజేపీలో నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారమే ఆయన రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే ఈశ్వరప్ప కుమారుడు కంటేశ్‌కు శివమొగ్గలోనే టికెట్ ఇస్తారా లేక మరోచోట ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈశ్వరప్ప బీజేపీకి 4 దశాబ్దాలకు పైగా సేవలందించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. కర్ణాటకలో ఈ ఎన్నికల్లో బీజేపీ 150 స్థానాల్లో గెలవబోతుందని ఈశ్వరప్ప జోస్యం చెప్పారు. జాతీయవాద ముస్లింలు బీజేపీ వెంటే ఉంటారని ఆయన చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా గతంలోనే ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. తన కుమారుడు విజయేంద్ర కోసం యెడ్యూరప్ప తప్పుకున్నారని ప్రచారం జరిగింది. ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు ఇచ్చే సంస్కృతి బీజేపీలో లేదని పరిశీలకులు చెబుతున్నారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా బలంగా వాణి వినిపిస్తున్న బీజేపీ ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోంది.
224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.
కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
Updated Date - 2023-04-11T18:51:27+05:30 IST