Karnataka : ఎన్నికల హామీలపై కర్ణాటక మంత్రివర్గం కీలక నిర్ణయం
ABN, First Publish Date - 2023-06-02T15:39:40+05:30
కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ముఖ్యమైన హామీలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ముఖ్యమైన హామీలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ప్రకటించారు. కుల, మత వివక్ష లేకుండా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. వీటిపై క్షుణ్ణంగా చర్చించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గృహ జ్యోతి పథకం క్రింద అన్ని కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, గృహ లక్ష్మి పథకం క్రింద ప్రతి కుటుంబ యజమానురాలికి నెలకు రూ.2,000 ఆర్థిక సాయం; అన్న భాగ్య పథకం క్రింద దారిద్ర్య రేఖకు దిగువనగల ప్రతి వ్యక్తికి నెలకు 10 కేజీల బియ్యం; యువ నిధి పథకం క్రింద 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులైన నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.3,000 చొప్పున, నిరుద్యోగ డిప్లమో హోల్డర్లకు నెలకు రూ.1,500 చొప్పున రెండేళ్లపాటు ఆర్థిక సాయం; శక్తి పథకం క్రింద ప్రజా రవాణా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేబినెట్ సమావేశానికి ముందు సిద్ధరామయ్య రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
అంతకుముందు సిద్ధరామయ్య మాట్లాడుతూ, కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి రూ.3 లక్షల కోట్లు అని, తాము ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రూ.50 వేల కోట్లు ఖర్చవుతుందని, ఇది తమకు భారం కాబోదని చెప్పారు.
శాసన సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఈ ఐదు హామీలను ఇచ్చింది. తమ పార్టీ అధికారం చేపడితే వీటిని అమలు చేస్తామని సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ సంతకాలతో గ్యారంటీ కార్డులను ప్రజలకు ఇచ్చారు. ప్రజలు బీజేపీని ఓడించి, కాంగ్రెస్‌ను గెలిపించారు.
ఇవి కూడా చదవండి :
Congress Vs BJP : ముస్లిం లీగ్ పూర్తి సెక్యులర్ పార్టీ : రాహుల్ గాంధీ
Congress : ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి.. 2024లో అనూహ్య ఫలితాలు.. : రాహుల్ గాంధీ
Updated Date - 2023-06-02T15:39:40+05:30 IST