Karnataka elections: చెప్పేదొకటి...చేసేది ఇంకోటి..బీజేపీ నేతలపై ప్రతిపక్షాల సెటైర్లు
ABN, First Publish Date - 2023-05-02T11:50:10+05:30
ఓటమి తప్పదని తెలిసి.. బీజేపీ బడా నేతలే ఉచిత హామీల ప్రకటన చేస్తున్నారని ..
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతల ఉచిత హామీల వ్యవహారం దుమారం రేపుతోంది. ఎన్నికల ప్రచారసభల్లో బీజేపీ నేతలు ఇబ్బడిముబ్బడిగా ఉచిత హామీలు గుప్పిస్తున్నారని, ఓటమి తప్పదని తెలిసి.. బీజేపీ బడా నేతలే ఉచిత హామీల ప్రకటన చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కన్నడిగులపై ఉచిత హామీల వరాల జల్లు కురిపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, రోజుకు అరలీటరు నందిని పాలు ఉచితంగా ఇస్తామని నడ్డా ప్రకటించారు. అయితే నడ్డా ఉచిత హామీలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ‘‘చెప్పేదొకటి... చేసేది ఇంకోటి..మేం ఉచితాలకు పూర్తి వ్యతిరేకం అంటారు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వొద్దని హుకుం జారీ చేస్తారు.. ఓడిపోతున్నాం అని తెలిసి కర్ణాటక ఎన్నికల్లో ఉచిత హామీలు కురిపిస్తున్నారు ఈ బీజేపి నేతలు’’ అని బీఆర్‌ఎస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
కాగా రాజకీయ పార్టీల ఉచిత పథకాలకు మేం పూర్తి వ్యతిరేకం అని ప్రధాని మోదీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఉచితాలపై ప్రధాని ప్రకటనపై అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పన్నులు చెల్లించేవారి సొమ్మును ఉచిత పథకాలకు ఖర్చు పెట్టడంపై వారంతా ఎంతో ఆవేదన చెందుతున్నారని, తమ ప్రభుత్వం పన్నుల సొమ్మును ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నామని..దీంతో కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు సంతోషంగా ఉన్నారంటూ అప్పట్లో మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శించాయి.
ప్రతిపక్ష ప్రభుత్వాలు పేదలకోసం చేపట్టే సంక్షేమ పథకాలను ఉచితాలని బీజేపీ నేతలు, ప్రధాని మోదీ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కూడా అంతకుమించి ఉచిత హామీలిస్తున్నది. మొన్నటికి మొన్న గుజరాత్‌లో విద్యాశాఖ మంత్రి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రతి కుటుంబానికి ఏటా రెండు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. మధ్యప్రదేశ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటేస్తే ఇంటికి ఒక ఆవును ఉచితంగా ఇస్తామని బీజేపీ గతంలో హామీ ఇచ్చింది. ఇప్పుడు కర్ణాటకలో ఉచిత హామీలు గుప్పిస్తున్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
Updated Date - 2023-05-02T11:52:18+05:30 IST