Gali Jarnardhana Reddy: పులి బోనులో ఉన్నా పులే..వెనకడుగు వేయదు..!
ABN, First Publish Date - 2023-03-10T15:57:03+05:30
భారతీయ జనతా పార్టీలోకి తిరిగి చేరనున్నట్టు వస్తున్న వదంతులను కర్ణాటక మైనింగ్ దిగ్గజం, రాజకీయనేత గాలి ..
బెంగళూరు: భారతీయ జనతా పార్టీ (BJP)లోకి తిరిగి చేరనున్నట్టు వస్తున్న వదంతులను కర్ణాటక మైనింగ్ దిగ్గజం, రాజకీయనేత గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhana Reddy) శుక్రవారంనాడు కొట్టివేశారు. ఆ వదంతుల్లో ఎలాంటి నిజం లేదన్నారు. బీజేపీలోకి రెడ్డి తిరిగి వస్తారనే నమ్మకం తనకుందంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
''బీజేపీలోకి తిరిగి వెళ్తాననే వదంతుల్లో నిజం లేదు. నేను వెనకడుగు వేయడం లేదు. వెనుకడుగు వేసే వాడు ధైర్యవంతుడు కాజాలడు. సీబీఐ ఉత్తర్వులు చూసి నేనేమీ షాక్ కాలేదు. నేను ఇతరులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. పులిని బోనులో పెట్టినా అది పులే'' అని గాలి జనార్దన రెడ్డి అన్నారు. విదేశాల్లో తనకు సొమ్ములుంటే దానిని కనిపెట్టడానికి ఏజెన్సీలకు ఎన్ని రోజులు పడుతుందని ఆయన ప్రశ్నించారు. ఏజెన్సీలు డబ్బులు వెనక్కి తెస్తే, ఆ సొమ్మును ప్రజలకే పంచిపెడతానని అన్నారు. బీజేపీలోకి తాను తిరిగి చేరుతున్నారనే వందతులన్నీ తన పార్టీలోకి ఇతరులను రాకుండా చేసే ప్రయత్నంగానే ఆయన పేర్కొన్నారు. తన సన్నిహితులు, భాగస్వామ్య సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను ప్రస్తావిస్తూ, కొత్త పార్టీతో ముందుకు వెళ్లకుండా తనను లొంగదీసుకోవచ్చని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అవుతుందని ఆయన చెప్పారు.
రాజకీయవర్గాల్లో వదంతులు...
కాగా, గాలి జనార్దన రెడ్డి తిరిగి బీజేపీలోకి వస్తారనే ఊహాగానాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. దీనిపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ, ఆయన (రెడ్డి) ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదని, మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. అయితే, నిజానికి బీజేపీతో ఆయన సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కచ్చితంగా ఆయన సముచిత నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. దీంతో గాలి జనార్దన రెడ్డి తన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి. గాలి జనార్దన రెడ్డి కొత్త పార్టీ నిర్ణయంతో కల్యాణ కర్ణాటక ప్రాంతంలో బీజేపీకి గట్టి సవాలు విసిరారు. రాయచూర్, యాద్‌గిర్, కొప్పల్, బీదర్, విజయనగర, బళ్లారి జిల్లాలు కల్యాణ కర్ణాటలో ఉన్నాయి.
సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి...
మరోవైపు, గాలి జనార్దన రెడ్డి విదేశీ పెట్టుబడులు, విదేశీ బ్యాంకుల్లో ఉన్న నిధులపై వివరాలు సేకరించేందుకు దర్యాప్తు సంస్థలకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాల కోసం స్విట్జర్లాండ్, సింగపూర్, యూఏఈలకు లేఖలు రాయాలని కూడా సీబీఐని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అక్రమ మైనింగ్, ఎగుమతులకు సంబంధించి కోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. సీఆర్‌పీసీ సెక్షన్ 166-ఎ కింద తమకు అనుమతులు ఇవ్వాలని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది. 2009-2010లో 70 నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం లావాదేవీలను రెడ్డి జరిపినట్టు సీబీఐ ఆరోపణగా ఉంది. కోర్టు ఆదేశాలతో అసంతృప్తి చెందిన రెడ్డి కొత్త పార్టీని ఏర్పాటు చేస్తూ, ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టడంతో కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది.
Updated Date - 2023-03-10T15:57:41+05:30 IST