Girl, father love: కూతురివి అనిపించుకున్నావ్ కదమ్మా!.. నాన్న కోసం 17 ఏళ్ల బాలిక చాలా గొప్ప పనే చేసేసింది...
ABN, First Publish Date - 2023-02-19T13:38:18+05:30
వృద్ధ తల్లిదండ్రులను కావడిలో మోసుకెళ్తూ, సేవలందించిన శ్రవణ కుమారుని కథ నుంచి స్ఫూర్తి పొందిందో ఏమో తెలియదు కానీ,
త్రిసూర్ : వృద్ధ తల్లిదండ్రులను కావడిలో మోసుకెళ్తూ, సేవలందించిన శ్రవణ కుమారుని కథ నుంచి స్ఫూర్తి పొందిందో ఏమో తెలియదు కానీ, కేరళకు చెందిన పదిహేడేళ్ళ బాలిక తన తండ్రి కోసం గొప్ప త్యాగం చేసింది. అమల్లో ఉన్న చట్టాల వల్ల ఎదురవుతున్న అడ్డంకులను న్యాయస్థానం ద్వారా తొలగించుకుని మరీ ఆమె తన తండ్రికి ప్రాణదానం చేసింది. ఆమె త్యాగనిరతిని అందరూ ప్రశంసిస్తున్నారు.
కేరళ (Kerala)లోని త్రిసూర్‌లో ప్రతీష్ (48) ఓ కేఫ్‌ను నడుపుతున్నారు. ఆయన తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. కేన్సరస్ లీజియన్ కూడా ఉందని, ఆయనకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయడం తప్పనిసరి అని వైద్యులు తెలిపారు. ఆయనకు కాలేయాన్ని ఇవ్వగలిగే తగిన అవయవ దాత దొరకలేదు. దీంతో ఆయన కుమార్తె దేవనంద (Devananda-17) చాలా ఆవేదనకు గురయ్యారు. తన తండ్రి కోసం తాను ఏదైనా చేయాలనుకున్నారు. తన కాలేయంలో కొంత భాగం ఆయనకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఓ మైనర్ తన అవయవాలను దానం చేయడానికి మన దేశంలో అమల్లో ఉన్న చట్టాలు అనుమతించవని తెలుసుకున్నారు. ఇటువంటి సందర్భం గతంలో వచ్చిందని, మైనర్ అవయవదానం చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని తెలుసుకుని, కేరళ హైకోర్టు (Kerala High Court)ను ఆశ్రయించారు. తన తండ్రికి తన కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చేందుకు అనుమతించాలని కోరారు. హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్తూ, అనేక సమస్యలను ఎదుర్కొంటూ, ఇంతటి త్యాగానికి సిద్ధమైనందుకు ఆమెను ప్రశంసించింది.
తన కాలేయాన్ని ఇచ్చేందుకు హైకోర్టు అనుమతించడంతో దేవనంద తన కాలేయం దానం చేయడానికి తగిన స్థాయిలో, ఆరోగ్యవంతంగా ఉండటం కోసం ఆహారపుటలవాట్లను పూర్తిగా మార్చుకున్నారు. స్థానిక జిమ్‌లో క్రమం తప్పకుండా వ్యాయామం చేశారు. ఈ నెల 9న అలువలోని ఓ ఆసుపత్రిలో తన కాలేయాన్ని దానం చేశారు. ఆమె సాహసానికి మెచ్చుకుని, శస్త్ర చికిత్సకు అయ్యే ఖర్చులను ఆసుపత్రి యాజమాన్యం ఉపసంహరించింది. ఓ వారం రోజుల తర్వాత ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు. తన తండ్రికి తన కాలేయంలో కొంత భాగం ఇవ్వడం తనకు గర్వకారణమని, సంతోషంగా ఉందని దేవనంద తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Delhi liquor policy : నన్ను అరెస్ట్ చేసి ఉండేవారు : మనీశ్ సిసోడియా
Sarpanch: మేనల్లుడి పెళ్లిలో ఓ గ్రామ మాజీ సర్పంచ్ ఊహించని పని... పెళ్లికి వచ్చినవారంతా షాక్...
Updated Date - 2023-02-19T13:38:22+05:30 IST