India vs Canada: హిందువులారా, మీ దేశానికి తిరిగి వెళ్లిపోండి.. ఖలిస్థానీ ఉగ్రవాది వార్నింగ్
ABN, First Publish Date - 2023-09-20T22:27:23+05:30
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణల కారణంగా.. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో...
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణల కారణంగా.. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ఖలిస్థానీ ఉగ్రవాదులు బారతీయులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా.. కెనడాలో ఉన్న భారతీయ హిందువులు తిరిగి దేశానికి వెళ్లిపోవాలని నిషేధిత ఖలిస్థానీ గ్రూప్ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్‌జే) నాయకుడు, ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ హెచ్చరికలు జారీ చేశాడు.
గురుపత్వంత్ మాట్లాడుతూ.. ‘‘కెనడా హిందువులారా.. మీరు కెనడా రాజ్యాంగం పట్ల విధేయతను తిరస్కరించారు. ఇప్పుడు మీ గమ్యం భారతదేశం. వెంటనే కెనడా వదిలి, మీరు మీ దేశానికి వెళ్లిపోండి’’ అని పేర్కొన్నాడు. ఖలిస్థానీ అనుకూల సిక్కులు ఎల్లప్పుడూ కెనడాకు విధేయులుగా ఉన్నారని.. వాళ్లు ఎప్పుడూ కెనడా చట్టాలను, రాజ్యాంగాన్ని వ్యతిరేకించరని అన్నాడు. అంతేకాదు.. అక్టోబర్ 29వ తేదీన వాంకోవర్‌లో కెనడా సిక్కులు సమావేశం అవ్వాలని, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత హై కమిషనర్ బాధ్యుడనే రిఫరెండంపై ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
గత వారంలోనూ కెనడాలో జరిగిన సభలో.. ప్రధాని మోదీ, అమిత్ షా, జై శంకర్, ఇతర అగ్రనేతలపై గురుపత్వంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘‘G20 సభ్యదేశాలు.. మీరు సెప్టెంబర్ 10వ తేదీన ఢిల్లీలో సమావేశం కానుండగా, మేము కెనడాలో ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహిస్తాము’’ అని ఓ వీడియోలో అతడు చెప్పుకొచ్చాడు. గతంలో కూడా ఖలిస్థానీ సంస్థలు కెనడాలో రిఫరెండంలు నిర్వహించాయి. ఈ విషయంపై భారత్ పలుమార్లు కెనడాతో తన ఆందోళనలు వ్యక్తం చేసింది కూడా! అటు.. జీ20 సమ్మిట్‌లోనూ కెనడా ప్రధాని ట్రూడో ముందే.. కెనడాలో ఖలిస్థానీ దాడులను భారత ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు.
ఇదిలావుండగా.. భారత ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ జూన్ 18వ తేదీన హత్యకావింపబడ్డాడు. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారం తమ ప్రభుత్వం వద్ద ఉందని ఇటీవల కెనడా ప్రధాని ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. కెనడాలోని భారత దౌత్యాధికారిని బహిష్కరించారు. ఇందుకు భారత్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ట్రూడో చేసిన ఆరోపణలు సరైనవి కావంటూ ఖండించిన భారత్.. భారత్‌లో ఉన్న కెనడా దౌత్యాధికారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. దీంతో.. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
Updated Date - 2023-09-20T22:27:23+05:30 IST