Kumaraswamy: మాజీ ముఖ్యమంత్రి ఎంతమాట అనేశారేంటో...
ABN, First Publish Date - 2023-03-23T11:04:06+05:30
బృహత్ బెంగళూరు మహానగర పాలికెను జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఏటీఎంగా చేసుకున్నాయని, వారికి అభివృద్ది పట్టలేదని జేడీఎస్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బృహత్ బెంగళూరు మహానగర పాలికెను జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఏటీఎంగా చేసుకున్నాయని, వారికి అభివృద్ది పట్టలేదని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy) మండిపడ్డారు. హెబ్బాళలో మంగళవారం రాత్రి రోడ్‌షోలో మాట్లాడుతూ గడిచిన 15 ఏళ్లుగా బెంగళూరు పాలికెను రెండుపార్టీలు దోచేశాయన్నారు. లూటీ సొమ్ముతోనే కుక్కర్లు, చీరలు పంచుతున్నారని హెబ్బాళ ఎమ్మెల్యేను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. జేడీఎస్(JDS)కు అధిష్టానం లేదని ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్నారు. హెబ్బాళ జేడీఎస్ అభ్యర్థి డాక్టర్ సయ్యద్ మెహీద్ అల్తాఫ్ స్థానికుడని, ఇక్కడి అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారన్నారు. బీజేపీకి అభివృద్ధి గురించి చింత లేదని కానీ హలాల్‌కట్, జట్కా కట్ వంటి అంశాలను తెరపైకి తెస్తుందని విమర్శించారు. తాజాగా ఉరిగౌడ, నంజేగౌడ పేరుతో సినిమా అంటూ సమాజంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేసిందన్నారు. భవిష్యత్తులో ఆపరేషన్ కమల చేసినా బీజేపీ అధికారంలోకి రాదన్నారు.
Updated Date - 2023-03-23T11:04:06+05:30 IST