Amit shah: వామపక్ష తీవ్రవాదానికి రెండేళ్లలో చరమగీతం: అమిత్‌షా
ABN, First Publish Date - 2023-10-06T20:42:13+05:30
వామపక్ష తీవ్రవాదానికి రాబోయే రెండేళ్లలో పూర్తిగా చరమగీతం పాడాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. వామపక్ష తీవ్రవాదంపై అమిత్‌షా అధ్యక్షతన శుక్రవారంనాడిక్కడ జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: వామపక్ష తీవ్రవాదానికి (Left Wing Extremism) రాబోయే రెండేళ్లలో పూర్తిగా చరమగీతం పాడాలని కేంద్రక హోం మంత్రి అమిత్‌షా (Amit shah) అన్నారు. వామపక్ష తీవ్రవాదంపై అమిత్‌షా అధ్యక్షతన శుక్రవారంనాడిక్కడ జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
దేశం నుంచి వాపమపక్ష తీవ్రవాదాన్ని కూకటివేళ్లతో పూర్తిగా నిర్మూలించేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్ రూపొందించడం, ఇంతవరకూ తీసుకున్న చర్యలపై సమీక్షించేందుకు ఈ సమావేశం ఏర్పాటయింది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణి, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరక్టర్ తపనే డెకా, ఎన్ఐఏ, సహస్ర సీమ బల్, బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎన్‌ఎస్‌జీ, ఐటీబీపీ డైరెక్టర్ జనరల్స్, నక్సల్స్ బాధిత రాష్ట్రాల హోం సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు సైతం పాల్గొన్నారు. 2021 సెప్టెంబర్‌లో చివరిసారిగా ఎల్‌డబ్ల్యూఈ సమావేశం జరిగింది.
నిర్ణయాత్మక దశకు చేరిన పోరాటం..
కాగా, వామపక్ష తీవ్రవాదంపై 2022, 2023లో గణనీయమైన విజయాలు సాధించామని, రాబోయే రెండేళ్లలో పూర్తిగా వామపక్ష తీవ్రవాదం బెడదను నిర్మూలించేందుకు ఈ ఏడాది గట్టిగా తీర్మానించుకోవాలని అమిత్‌షా శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేశారు. వామపక్ష తీవ్రవాదంపై పోరు నిర్ణయాత్మక దశకు చేరిందన్నారు. నక్సల్స్ తమ స్థావరాలను కొత్త ప్రాంతాలకు విస్తరించకుండా ఏజెన్సీలు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. 2019 నుంచి నక్సల్స్ బాధిత ప్రాంతాల్లో భద్రతా బలగాలతో 195 కొత్త క్యాంపులు ఏర్పాటు చేశామని, మరో 44 కొత్త క్యాంపులు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. వామపక్ష తీవ్రవాదం నుంచి ఆయా ప్రాంతాలను విముక్తి చేసేందుకు నిరంతర నిఘాఉంచాలని, తిరిగి సమస్య తలెత్తకుండా చూడాలని అన్నారు. ఎక్కడ సమస్య ఉందో అక్కడే నిర్మూలనా చర్యలు తీసుకోవడం వల్ల ఇతర రాష్ట్రాలలో తీవ్రవాదులు ఆశ్రయం పొందే అవకాశం ఉండదన్నారు. 2014 నుంచి వామపక్ష తీవ్రవాదంపై ప్రభుత్వం ఉక్కుపిడికిలి బిగించిదని, ప్రభుత్వ చర్యలతో గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నడూ లేనంతగా 2022లో హింసాత్మక ఘటనలు, మృతుల సంఖ్య బాగా తగ్గిందన్నారు.
ఎన్ఐఏ, ఈడీ, రాష్ట్ర ఏజెన్సీలు మరింత సమన్వయంతో పనిచేసి వామపక్ష తీవ్రవాదం ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నారు. నక్సల్స్ బాధిత ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టులపై మాట్లాడుతూ, రోడ్ల నిర్మాణం, టెలికమ్యూనికేషన్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, స్కిల్ డవలప్‌మెంట్, ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఎల్‌డబ్ల్యూఈ బాధిత జిల్లాల్లో స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ స్కీమ్ కింద 14 వేలకు పైగా ప్రాజెక్టులను కేంద్రం ప్రారంభించిందని తెలిపారు. వీటిలో 80 శాతానికి పైగా ప్రాజెక్టులు పూర్తయ్యాయని, ఈ స్కీమ్ కింద కేంద్రం రూ.3,296 కోట్లు విడుదల చేసిందని అమిత్‌షా చెప్పారు.
Updated Date - 2023-10-06T20:42:13+05:30 IST