Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్‌ఐసీ కీలక ప్రకటన
ABN, First Publish Date - 2023-06-04T13:31:15+05:30
ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటన దేశాన్ని కలచివేస్తోంది. ఏకంగా 288 మంది ప్రాణాలు కోల్పోవడం, మరో 1100 మంది గాయాలపాలవ్వడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘోరప్రమాదంలో బాధితుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ (Life insurance Corporation on India) కీలక ప్రకటన చేసింది.
బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటన దేశాన్ని కలచివేస్తోంది. ఏకంగా 288 మంది ప్రాణాలు కోల్పోవడం, మరో 1100 మంది గాయాలపాలవ్వడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘోరప్రమాదంలో బాధితుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ (Life insurance Corporation on India) కీలక ప్రకటన చేసింది. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో కొన్ని మినహాయింపులు కల్పించనున్నట్టు తెలిపింది. బాధితుల బంధువులకు ఈ ప్రత్యేక రిలీఫ్ ఇవ్వనున్నట్టు ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతీ శనివారం సాయంత్రం ప్రకటించారు. ‘‘ బాలాసోర్‌లో జరిగిన రైలు దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ప్రభావిత బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించాం. కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక ఉపశమనం కల్పించడంలో భాగంగా పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను వేగవంతం చేస్తాం’’ అని వెల్లడించారు.
ఎల్ఐసీ, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాల క్లెయిమ్‌లో ఇబ్బందులు తగ్గించేందుకు పలు రాయితీలను కూడా ఎల్ఐసీ ప్రకటించింది. రిజిష్టర్డ్ డెత్ సర్టిఫికెట్ లేకపోయిన ఫర్వాలేదని, రైల్వే ప్రకటించిన జాబితా లేదా పోలీసులు, రాష్ట్రం, కేంద్ర అధికారులకు ప్రకటించిన జాబితాల ఆధారంగా మరణాన్ని ధృవీకరించుకుంటామని ఎల్ఐసీ స్పష్టం చేసింది. బాధితుల సహాయార్థం, సందేహాల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని, 022-68276827 నంబర్‌కు కాల్ చేయవచ్చునని సూచించింది. క్లెయిమ్‌లను వీలైనంత త్వరగా పూర్తిచేసి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని పేర్కొంది.
బాధ్యుల గుర్తింపు...
భారత చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటైన ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనకు (Odisha train tragedy) మూలకారణాన్ని గుర్తించామని కేంద్ర రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్ ఆదివారం ప్రకటించారు. ఎలక్ట్రిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంపై దర్యాప్తు పూర్తయ్యిందని చెప్పారు. బాధ్యులను కూడా గుర్తించామన్నారు. అయితే రైల్ సేఫ్టీ కమిషనర్ వీలైనంత త్వరగా ఈ రిపోర్ట్‌ను సమర్పిస్తారని, ప్రభుత్వానికి రిపోర్ట్ అందిన వెంటనే పూర్తి వివరాలు బయటకు వెల్లడిస్తామని మంత్రి చెప్పారు. కాగా మూడు రైళ్లు ఢీకొన్న ప్రాంతాన్ని ఆదివారం ఉదయం సందర్శించారు. ట్రాక్‌ల పునరుద్ధరణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
Updated Date - 2023-06-04T13:36:06+05:30 IST