Russia Luna-25: చంద్రుడిపై కూలిపోయిన రష్యా లునా-25 మిషన్.. ఏం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-08-20T15:01:16+05:30
చంద్రయాన్-3 కంటే ముందుగా చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్, అన్వేషణ మొదలుపెట్టి సంచలనం సృష్టించాలనుకున్న రష్యాకు ఊహించని షాక్ తగిలింది. ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రొస్కోమస్ (Roskosmos) ఇటివల ప్రయోగించిన లునా-25 (Luna-25) స్పేస్ క్రాఫ్ట్ జాబిల్లి ఉపరితలంపై కుప్పకూలింది.
చంద్రయాన్-3 కంటే ముందుగా చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్, అన్వేషణ మొదలుపెట్టి సంచలనం సృష్టించాలనుకున్న రష్యాకు ఊహించని షాక్ తగిలింది. ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రొస్కోమస్ (Roskosmos) ఇటివల ప్రయోగించిన లునా-25 (Luna-25) స్పేస్ క్రాఫ్ట్ జాబిల్లి ఉపరితలంపై కుప్పకూలింది. ఈ మేరకు రొస్కోమస్ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నియంత్రించలేని కక్ష్యలోకి వెళ్లడం ఈ ప్రమాదానికి దారితీసిందని వివరించింది.
‘‘ ఆగస్టు 21న సాఫ్ట్ ల్యాండింగ్ చేయాల్సి ఉన్నందున శనివారం 11.10 గంటల (GMT) సమయంలో స్పేస్ క్రాఫ్ట్‌ని ప్రీ-ల్యాండింగ్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టేందుకు మిషన్ కంట్రోల్ ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో అసాధారణ పరిస్థితులు తలెత్తాయి. ఆపరేషన్ సమయంలో ఆటోమేటిక్ స్టేషన్‌పై అసాధారణ పరిస్థితి ఎదురైంది. దీంతో చేయాల్సిన విన్యాసప్రక్రియను పూర్తి చేయడం సాధ్యపడలేదు’’ అని రొస్కోమస్ శాస్త్రవేత్తలు తెలిపారు. స్పేస్‌క్రాఫ్ట్ లునా-25ని ప్రీ-ల్యాండింగ్ ఆర్బిట్‌లోకి మరల్చడంలో సమస్య తలెత్తిందని రొస్కోమస్ ప్రకటించిన మరుసటి రోజే కూలిపోవడం గమనార్హం.
లునా-25 స్పేస్‌క్రాఫ్ట్ పరికరం అంచనా వేయని కక్ష్యలోకి వెళ్లడం, అక్కడ నుంచి మరల్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టిందని రొస్కోమస్ వివరించింది. కాగా.. దాదాపు 47 ఏళ్ల తర్వాత చంద్రుడి పరిశోధనల కోసం రష్యా చేపట్టిన ప్రయోగం ఇదే కావడం గమనార్హం. ఈ స్పేస్ క్రాఫ్ట్ రేపు (సోమవారం) చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాల్సి ఉంది. ఒక రోజు ముందే ఈ పరిణామం జరగడం గమనార్హం.
Updated Date - 2023-08-20T15:22:03+05:30 IST