Mahadev App Case: మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. సీఎం సలహా ఇచ్చాడంటూ యాప్ ఓనర్ సంచలన ఆరోపణలు
ABN, First Publish Date - 2023-11-05T21:58:34+05:30
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్నికల హోరుతో పాటు ‘మహాదేవ్ బెట్టింగ్ యాప్’ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు దొరికిన ఒక ‘కొరియర్’తో...
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్నికల హోరుతో పాటు ‘మహాదేవ్ బెట్టింగ్ యాప్’ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు దొరికిన ఒక ‘కొరియర్’తో ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే.. ఎన్నికల కోసం ఆ యాప్ నిర్వాహకుల నుంచి రూ.508 కోట్లు అందుకున్నారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇది చినికి చినికి గాలివానగా మారుతూ.. బీజేపీ vs కాంగ్రెస్ గొడవగా అవతారమెత్తింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో.. తాజాగా ఈ కేసులో ఒక ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్ శుభమ్ సోని తెరమీదకి వచ్చి.. సంచలన విషయాల్ని బయటపెట్టాడని సమాచారం.
శుభమ్ సోని ఏం చెప్పాడు?
మహాదేవ్ బెట్టింగ్ యాప్ వివాదం వెలుగులోకి రావడంతో.. ఆ యాప్ ఓనర్ శుభమ్ సోని దుబాయ్ నుంచి ఒక వీడియోని రూపొందించాడని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వీడియోలో అతను మాట్లాడుతూ.. దుబాయ్ వెళ్లమని తనకు సీఎం భూపేష్ సలహా ఇచ్చారని కుండబద్దలు కొట్టాడని తెలిసింది. తానే మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ని నిజమైన యజమానినని అందులో నొక్కి చెప్పినట్టు వెల్లడైంది. ఒకవేళ అతడు చేసిన ఆరోపణలు నిజమే అయితే.. ఈ కేసులో సరికొత్త మలుపు తీసుకున్నట్టే.. భూపేష్ బఘేల్ ఇరకాటంలో పడినట్టే. కాగా.. మనీలాండరింగ్ కేసులో ఈడీకి ఈ శుభమ్ సోని మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.
మహాదేవ్ బెట్టింగ్ కేసు ఎలా వెలుగులోకి వచ్చింది?
ఇటీవల అసీమ్ దాస్ పేరిట రూ.5.39 కోట్లతో కూడిన ఒక కొరియర్ ఈడీ చేతికి చిక్కింది. ఆ డబ్బుల్ని సీజ్ చేసిన ఈడీ.. అసీమ్ దాస్‌ని మరింత విచారించింది. విచారణలో భాగంగా.. ఆ డబ్బులు భూపేష్ బఘేల్ కోసం దుబాయ్ నుంచి శుభమ్ సోని పంపించినట్టు తెలిపాడు. ఇదే సమయంలో బెట్టింగ్ యాప్‌తో అనుసంధానించబడిన కొన్ని బినామీ బ్యాంకు ఖాతాలు కూడా కనుగొనబడ్డాయి. ఆ ఖాతాల్లోని రూ.15.59 కోట్లను సైతం సీజ్ చేశారు. అసీమ్ దాస్ వద్ద నుంచి అదుపులోకి తీసుకున్న సెల్‌ఫోన్, శుభమ్ పంపిన ఈ-మెయిల్స్‌ని పరీక్షంగా.. ఆ యాప్ ప్రమోటర్లు ఇప్పటిదాకా భూపేష్‌కి రూ.508 కోట్లను చెల్లించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
భూపేష్ స్పందన ఏంటి?
తనపై ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఆరోపనలు వచ్చిన వెంటనే భూపేష్ బఘేల్ ఖండించారు. ఇదంతా బీజేపీ వ్యూహమని మండిపడ్డారు. నిజానికి.. ఆ యాప్ నిర్వాహకులతో బీజేపీనే ఒప్పందం కుదుర్చుకుందని తిప్పికొట్టారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో తాము గెలవలేమని బీజేపీకి స్పష్టమైందని, అందుకే ఈ కొత్త వివాదానికి తెరలేపిందని పేర్కొన్నారు. అసలు ఇంతవరకు ఆ యాప్‌ని ఎందుకు మూసివేయలేదని, దుబాయ్‌లో ఉన్న నిర్వాహకుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. అటు.. బీజేపీ మాత్రం అక్రమార్గంలో కాంగ్రెస్ ప్రజాధనాన్ని దోచుకుంటోందంటూ ఆరోపణలు చేస్తోంది. చివరికి.. ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో?
Updated Date - 2023-11-05T21:58:35+05:30 IST