Mangalore Airport: మంగళూరులో పగటిపూట విమానాల సంచారాలకు బ్రేక్
ABN, First Publish Date - 2023-02-09T11:52:51+05:30
మంగళూరులోని బజ్పే ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి ఇకపై పగటి వేళల్లో విమానాల సంచారాలకు బ్రేక్ పడనుంది. నాలుగు నెలల
- రన్‌వేకు మరమ్మతులు
- నాలుగు నెలలు ఇదే విధానం అమలు
బెంగళూరు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): మంగళూరులోని బజ్పే ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి ఇకపై పగటి వేళల్లో విమానాల సంచారాలకు బ్రేక్ పడనుంది. నాలుగు నెలల పాటు కేవలం రాత్రి వేళల్లో మాత్రమే విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఇకపై మంగళూరు విమానాశ్రయం(Mangalore Airport) నుంచి రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడక తప్పదు. రన్‌వే మరమ్మతులతో పాటు అదనపు నిర్మాణాల కారణంగానే పగటి వేళల్లో విమానాల సంచారాలను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. జనవరి చివరి నుంచే నిర్మాణాల ప్రక్రియ ప్రారంభమైనా తాజాగా పగటి వేళల్లో విమానాల సంచారాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మే 31 వరకూ నిబంధనలు అమలులో ఉంటాయి. ఆదివారం, జాతీయ పర్వదినాలు మినహాయించి నాలుగు నెలలు పాటు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం ఆరుదాకా రన్‌వే నిర్మాణాలు జరగనున్నాయి. సడలింపుల కారణంగా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే మంగళూరు నుంచి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. మంగళూరు నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ నుంచి ఇతర దేశాలకు వెళ్లదలచినవారు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపుగా సదరు ఎయిర్ పోర్టులకు చేరుకుని ఇతర దేశాలకు వెళ్లేవారు. కేవలం గంటల వ్యవధి ఉన్నా అనుకూలంగా ఉండేది. ప్రస్తుతం ఒక రోజు ముందుగానే వెళ్లాల్సి వస్తుంది. ఉదయం మూడునాలుగు గంటల పాటు మాత్రమే ప్రయాణాలకు వీలుండటంతో అర్ధరాత్రికే విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. రెండురోజుల కిందటే మంగళూరు నుంచి మస్కట్‌కు విమానం బయలుదేరేందుకు 9.20 గంటలకు సిద్ధమైంది. సాంకేతిక లోపం కారణంగా 15 నిమిషాలు జాప్యమైంది. 9.30 గంటలకు రన్‌వే మూసివేయడంతో సాయంత్రం దాకా విమానం కదలలేదు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటనలో మార్పు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈనెల11న దక్షిణకన్నడ జిల్లా పుత్తూరు వస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మంగళూరుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన పుత్తూరుకు వెళ్లేలా షెడ్యూలు ఖరారైనా తాజాగా విమానాల సంచారాల మార్పుతో మార్చుకున్నారు. ఢిల్లీ నుంచి కేరళలోని కణ్ణూరు విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా పుత్తూరుకు చేరుకుంటారు. సాయంత్రం తర్వాత మంగళూరు నుంచే వెనుతిరిగి వెళ్లనున్నారు. ఎన్నికల వేళ మరింత మంది రాజకీయ ప్రముఖులు పర్యటనల్లో మార్పులు చేసుకుంటున్నారు. 2,450 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో కాంక్రీట్ రన్‌వేను 2006లో పూర్తీ చేశారు. ప్రస్తుతం విస్తరణ కార్యాచరణ సాగుతోంది.
ఇదికూడా చదవండి: ఆలయాల్లో ఏనుగులకు ప్రత్యేక వసతులు
Updated Date - 2023-02-09T11:52:53+05:30 IST