Manipur : మణిపూర్‌లో మిలిటెంట్ల కాల్పులు.. బీఎస్ఎఫ్ జవాను మృతి, ఇద్దరు అస్సాం రైఫిల్స్ సిబ్బందికి గాయాలు..
ABN, First Publish Date - 2023-06-06T13:14:08+05:30
హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయారు. సోమ-మంగళవారాల మధ్య రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో బీఎస్ఎఫ్
న్యూఢిల్లీ : హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయారు. సోమ-మంగళవారాల మధ్య రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం-BSF) జవాను ఒకరు ప్రాణాలు కోల్పోగా, అస్సాం రైఫిల్స్ సిబ్బంది ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సెరోవు ప్రాంతంలో ఏరియా డామినేషన్ ఆపరేషన్స్‌లో ఈ సంఘటన జరిగింది.
మణిపూర్ జనాభాలో 53 శాతం మంది ఉన్న మెయిటీలు షెడ్యూల్డు తెగల హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను పరిశీలించి, సిఫారసు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కుకీ తదితర తెగలవారు పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మే 3 నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింసాకాండ జరుగుతోంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఈ రాష్ట్రంలో పర్యటించారు. వివిధ వర్గాలవారితో మాట్లాడారు. తమ వద్దనున్న ఆయుధాలను పోలీసులకు అప్పగించాలని ప్రజలను కోరారు. మెయిటీలు జనాభాలో 53 శాతం మంది ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని 10 శాతం భూమిలో మాత్రమే ఉన్నారు. మిగిలిన భూమిపై వీరికి ఎటువంటి హక్కులు లేవు. అదే సమయంలో కుకీ తదితర తెగలవారు షెడ్యూల్డు తెగల జాబితాలో ఉండటంతో రాష్ట్రం మొత్తం భూమిలో వీరికి హక్కులు ఉన్నాయి. అందుకే తమను షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చాలని మెయిటీలు డిమాండ్ చేస్తున్నారు.
మణిపూర్‌లో హింస చెలరేగిన ప్రాంతాల్లో శాంతిని పునరుద్ధరించేందుకు భారత సైన్యం, అస్సాం రైఫిల్స్, సీఏపీఎఫ్, పోలీసులు సంయుక్తంగా కృషి చేస్తున్నారు. భారత సైన్యం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, భద్రతా దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఏరియా డామినేషన్ ఆపరేషన్స్‌లో
సెరోవు ప్రాంతంలో మిలిటెంట్లతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బీఎస్ఎఫ్ జవాను ఒకరు, అస్సాం రైఫిల్స్ సిబ్బంది ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హెలికాప్టర్లో ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేసరికి బీఎస్ఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు.
బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం, సోమ-మంగళవారం మధ్య రాత్రి 4.05 గంటల సమయంలో అనుమానిత కుకీ మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సెరోవు ప్రాక్టికల్ హైస్కూల్‌లో విధి నిర్వహణలో ఉన్న బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ రంజిత్ యాదవ్ ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే ఇంఫాల్, కాక్చింగ్ ప్రాంతంలో ఉన్న జీతన్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు.
సైనికాధికారుల కథనం ప్రకారం, భద్రతా దళాలు, మిటిటెంట్ల మధ్య సోమవారం రాత్రంతా కాల్పులు జరిగాయి. మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. భద్రతా దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి.
ఇదిలావుండగా, కాక్చింగ్ జిల్లాలోని సెరోవూ గ్రామంలో దాదాపు 100 ఇళ్లను మిలిటెంట్లు ఆదివారం తగులబెట్టారు. ఈ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా మిలిటెంట్లు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. సెవోవూలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కే రంజిత్ సింగ్ ఇంటిని మూకలు ధ్వంసం చేశాయి. ఎమ్మెల్యేతోపాటు ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. కూంబింగ్ ఆపరేషన్లో 40 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆటోమేటిక్ రైఫిళ్లు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మోర్టార్లు, పేలుడు పదార్థాలు వంటివాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కుకీ తదితర తెగలవారి మధ్య జరిగిన హింసాకాండలో దాదాపు 98 మంది ప్రాణాలు కోల్పోయారు. 310 మంది గాయపడ్డారు. సుమారు 4,000 గృహదహనం కేసులు నమోదయ్యాయి. సుమారు 36 వేల మంది నిరాశ్రయులయ్యారు.
ఇవి కూడా చదవండి :
Odisha train accident: 48 గంటల తర్వాత సజీవంగా కనిపించిన వ్యక్తి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..
America : భారత్ శక్తిమంతమైన, జీవచైతన్యంగల ప్రజాస్వామిక దేశం : అమెరికా
Updated Date - 2023-06-06T13:14:08+05:30 IST