Udayanidhi : సీఎం కొడుకు.. ఇప్పుడు మంత్రి కూడా.. అయినా మాకేం..!
ABN, First Publish Date - 2023-05-28T08:59:21+05:30
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా సంస్థ, కల్లల్ గ్రూపు కంపెనీ నిర్వాహకులు పెటికో కమర్షియో ఇంటర్నేషనల్ సంస్థను రూ.114.37 కోట్లకు మేర
- ట్రస్టు బ్యాంక్ ఖాతాలోని నగదు జప్తు
- అక్రమ నగదు బట్వాడాపై ఈడీ చర్య
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా సంస్థ, కల్లల్ గ్రూపు కంపెనీ నిర్వాహకులు పెటికో కమర్షియో ఇంటర్నేషనల్ సంస్థను రూ.114.37 కోట్లకు మేరకు మోసగించారనే ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం (ఈడీ) అధికారులు తమిళనాడు యువజన సంక్షేమ, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్(Minister Udayanidhi Stalin) నడుపుతున్న ట్రస్టు బ్యాంక్ ఖాతాలోని రూ. 34.7 లక్షల నగదును జప్తు చేశారు. ఈ మేరకు ఈడీ అధికారులు శనివారం ప్రకనట విడుదల చేశారు. లైకా, కల్లల్ గ్రూపు సంస్థలు రూ.300 కోట్ల మేరకు అక్రమ నగదుబట్వాడాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ పెటికో కమర్షియో ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ గౌరవ్‌సాస్రా చేసిన ఫిర్యాదుమేరకు ఆ రెండు సంస్థలపై సెంట్రల్ క్రైం విభాగం పోలీసులు కేసు నమోదు చేశారని, ఆ కేసుపై తాము విచారణ జరిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా గత ఏప్రిల్ 27, మే 16న లైకా కార్యాలయాలు, నిర్వాహకుల నివాసాల్లో తనిఖీలు జరిపిన డిజిటల్‌పరమైన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటి ఆధారంగా రూ.36.3 కోట్ల విలువైన చరాస్థులను జప్తు చేసినట్లు వివరించారు. అదే సమయంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న రెండు సంస్థల ద్వారా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సంబంధించిన ట్రస్టు ఖాతాకు కోటి రూపాయలు జమ చేసినట్లు విచారణలో వెల్లడి కావటంతో ఆ ఖాతాలో ఉన్న రూ.34.7 లక్షల నగదును జప్తు చేసినట్లు ప్రకటించారు.
Updated Date - 2023-05-28T09:22:03+05:30 IST