Kamal Haasan: స్టాలిన్, నేనూ మంచి మిత్రులం: కమల్‌హాసన్
ABN, First Publish Date - 2023-02-28T14:26:35+05:30
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తానూ మంచి మిత్రులమని, తమది రాజకీయాలకు అతీతమైన స్నేహమని...
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin), తానూ మంచి మిత్రులమని, తమది రాజకీయాలకు అతీతమైన స్నేహమని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ (Kamal Hassan) తెలిపారు. మార్చి 1వ తేదీన స్టాలిన్ 70వ జన్మదినోత్సవం సందర్భంగా డీఎంకే రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాజా అన్నామలై మండ్రంలో మంగళవారంనాడు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించేందుకు కమల్ హాసన్ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాజకీయలతో సంబంధం లేని స్నేహం తనకూ, స్టాలిన్‌కు మధ్య ఉందని చెప్పారు. స్టాలిన్ ఒక గొప్ప నేత కుమారుడని, సవాళ్లను ఎదుర్కొంటూ క్రమక్రమంగా ఎదిగి సీఎం స్థాయికి వచ్చారని అన్నారు.
డీఎంకేతో సమీప భవిష్యత్తులో పొత్తుపై అడిగినప్పుడు, ఇది రాజకీయాల గురించి మాట్లాడే సమయం కాదని కమల్ అన్నారు. పొత్తు గురించి ఇప్పుడికిప్పుడు ఏమీ చెప్పలేనని తెలిపారు. కథలో ఒక సన్నివేశం తర్వాత మరో సన్నివేశం వస్తుందని, అలాగే క్రమ క్రమంగా ముందుకు వెళ్తామని, ఇప్పడికిప్పుడైతే క్లైమాక్స్ ఉండదని నవ్వుతూ చెప్పారు. ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికలో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రొగ్రసివ్ అలయెన్స్ (ఎస్‌పీఏ) అభ్యర్థి ఈవీకేఎస్ ఇలాంగోవన్‌కు ఇటీవల కమల్‌హాసన్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే డీఎంకే, ఎంఎన్ఎం మధ్య పొత్తు కుదరనుందనే ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.
స్టాలిన్ పుట్టినరోజు వేడుకకు ప్రముఖ నేతలు..
కాగా, స్టాలిన్ పుట్టినరోజు వేడుక సందర్భంగా బుధవారం సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని వైఎంసీఏ గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు డీఎంకే ప్లాన్ చేస్తోంది. దీనికి డీఎంకే సీనియర్ నేతలు దురై మురుగన్, టీఆర్ బాలు అధ్యక్షత వహిస్తారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తదితర రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
బ్యానర్లు, భారీ హంగామాలు వద్దు: సీఎం
మరోవైపు, స్టాలిన్ ఒక ప్రకటనలో తన పుట్టినరోజు వేడుకలకు బ్యానర్లు ఏర్పాటు చేయవద్దని, ఎక్కువ హంగామా చేయవద్దని పార్టీ కార్యకర్తలను కోరారు. పార్టీ నేతల సిద్ధాంతాలను తూచ తప్పకుండా పాటిస్తూ, పార్టీ సంక్షేమానికి, ముఖ్యంగా పేదలను ఆదుకోవడం ద్వారా ప్రజా సంక్షేమానికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
Updated Date - 2023-02-28T14:26:35+05:30 IST