ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sengol: రాజదండం ఓ మిస్టరీ..? ఎన్నో అభూత కల్పనలు...!?

ABN, First Publish Date - 2023-05-31T21:24:24+05:30

దేశ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ ఘట్టం ఎంత ప్రచారంలోకి వచ్చిందో, అంతకంటే ఎక్కువ ప్రచారం సెంగోల్‌కు వచ్చింది. భిన్న కథనాలతో అంతా ఓ మిస్టరీగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ ఘట్టం ఎంత ప్రచారంలోకి వచ్చిందో, అంతకంటే ఎక్కువ ప్రచారం సెంగోల్ (Sengol)కు వచ్చింది. నేటితో 'పూర్తి స్వాతంత్ర్యం' వచ్చిందని అధికార బీజేపీ నేతలు కొందరు గర్వంగా చాటుకోగా, అధికార మార్పిడికి వాడే చిహ్నంగా చెప్పుకునే సెంగోల్‌ను పార్లమెంటులో ఏర్పాటు చేయడాన్ని, అసలు 1947 ఆగస్టులో వచ్చినది స్వాతంత్ర్యం కాదనే రీతిలో మోదీ ప్రభుత్వం మాట్లాడటాన్ని కాంగ్రెస్ నిలదీసింది. చిట్టచివరి బ్రిటిష్ వైస్రాయి మౌంట్ బాటన్ చేతుల మీదుగా నెహ్రూ 'సెంగోల్' అందుకున్నట్టు డాక్యుమెంటరీ ఆధారాలు లేవని కుండబద్ధలు కొట్టింది. అదే నిజమైతే, మౌంట్ బాటన్ చేతుల మీదుగా నెహ్రూ రాజదండం అందుకున్న ఫోటోలు ఏవని ప్రశ్నించింది. మఠాధిపతుల చేతుల మీదుగా నెహ్రూ సెంగోల్ అందుకున్నట్టు చూపే ఫోటోలో కానీ, ప్రభుత్వం చెబుతున్న ఫోటోలు ఎక్కడో చూపించాలని నిలదీసింది. ఈ నేపథ్యంలో రాజదండం ప్రాముఖ్యం ఏమీ లేదా? బ్రిటిషర్ల నుంచి అధికారం బదిలీకి ముందు నెహ్రూకు వచ్చిన అనేకమైన కానుకలు (Gifts)లో రాజదండం కూడా ఒకటా? ఆ బహుమతులన్నీ మ్యూజియంకి చేరినప్పుడు రాజదండానికి ఎందుకు పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంలో అంత ప్రాధాన్యం ఇచ్చారు? తెరపైకి సెంగోల్ తీసుకురావడం ద్వారా కొన్ని ప్రధాన విషయాలను మరుగుపరచే ఉద్దేశం ఏదైనా కేంద్ర సర్కార్‌కు ఉందా? అనే విషయాలపై మీడియాలో రసవత్తర చర్చ కొనసాగుతోంది.

కేంద్రం ఏం చెబుతోంది?

మోదీ ప్రభుత్వం చెబుతున్న వివరాల ప్రకారం, 1947 ఆగస్టు 14న భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి మౌంట్ బాటన్ అధికార మార్పిడికి సంకేతంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారని నెహ్రూను అడిగాను. దీంతో రాజగోపాలాచారిని నెహ్రూ సంప్రదించారు. ఆయన తమిళనాడులోని తువడుత్తురై ఆధీనానికి వెళ్ళి ప్రత్యేక రాజదండం తయారు చేయించమని కోరారు. మఠం నిర్వాహకులు బంగారంతో 'సెంగోల్' తయారు చేసి ప్రభుత్వం తరఫున పంపిన ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి ఢిల్లీకి తీసుకువెళ్లారు. 1947 ఆగస్టు 14న భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొద్ది నిమిషాలకు ముందు సుమారు 11.45 గంటలకు మఠం ప్రతినిధి బృందం నెహ్రూకు రాజదండం అందించింది. అనంతరం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో లార్డ్ మౌంట్ బాటన్ మఠం ప్రతినిధి కుమారస్వామి తంబిరాన్‌కు ఇవ్వగా, ఆయన పవిత్రజలం చల్లి, నెహ్రూకు అందజేశారు.

'టైమ్' కథనం ఏం చెప్పింది?

1947 ఆగస్టు 25న టైమ్ మ్యాగజైన్‌లో నెహ్రూకు రాజదండం ఎలా చేరిందనే విషయం ఉంది. తిరువావడుదురై మఠానికి చెందిన వ్యక్తులను రాజదండం చేయించమని రాజాజీ చెప్పడనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని అందులో పేర్కొంది. ప్రాచీన రాజుల వలే నెహ్రూ కూడా హిందూ సాధువుల నుంచి రాజదండం పొందితే బాగుంటుందని తంజావూరు మఠాధిపతి అంబాలవాన దేశికర్ అప్పట్లో బావించారు. ఆయన, ఆయన ఇద్దరు అనుచరులు, నాదస్వర పిళ్లై కలిసి ఆగస్టు 14న నెహ్రూ ఇంటికి ఊరేగింపుగా వచ్చి, నెహ్రూ నుదిటిపై విభూతి పూసి, ఆయనకు పట్టువస్త్రం చుట్టి సెంగోల్‌ను బహుకరించారు.

అన్నాదురై ఆర్టికల్ ఏమి చెప్పింది?

స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది రోజులకే 1947 ఆగస్టు 24న సీఎన్ అన్నాదురై ఒక ఆర్టికల్ రాశారు. రాజదండాన్ని, దాన్ని హిందూ మఠం నెహ్రూకు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ సమయంలో అన్నాదురై.. ద్రవిడార్ కళగం (డీకే) సభ్యుడిగా ఉన్నారు. తిరువవాడుతురై అధీనంపై తన ఆర్టికల్‌లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తురుణంలో మఠం ప్రతినిధులు నెహ్రూకు సెంగోల్ బహుకరించడం వెనుక ఉన్న ఉద్దేశాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అర్ధం లేని వ్యవహారమని, దీని వెనుక ఉన్న లోతైన అర్ధాన్ని గ్రహిస్తే, ఎంత ప్రమాదకరమైనదో అర్ధమవుతుందని అన్నారు. సెంగాల్ గురించి పండితార్ (నెహ్రూ) ఆలోచన ఏమిటో, సెంగాల్‌తో పాటు ఎలాంటి లేఖను అధీనం అధిపతి పంపారో తమకు అవగతం కావడం లేదన్నారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే సెంగాల్‌కు ప్రాధాన్యత ఇవ్వడమనే ఆలోచనకు దూరంగా ఉండాలని నెహ్రూను అన్నాదురై కోరారు. ఆ తర్వాత కాలంలోనే అన్నాదురై డీఎంకే పార్టీని స్థాపించారు.

కల్పనలే...

సెంగోల్‌‌పై జరగని విషయాలు జరిగినట్టుగా చెబుతుండటం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యలు మరింత సంచలనం రేపుతున్నారు. 1947 ఆగస్టు 14న లార్డ్ మౌంట్ బాటన్ పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరాచీలో ఉన్నారని, సాయంత్రం 7 గంటలకు ఆయన ఢిల్లీ వచ్చారని సెంగాల్‌కు సంబంధించి చరిత్రకారులు చెప్పిన విషయాన్ని చిదంబరం ప్రస్తావించారు. అయితే, ఎన్నడూ జరగని కథనలను కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తుండటం దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి సైతం మొన్న ఒక కథ చెప్పారని, అయితే ఎవర్ని నమ్మాలని చిదంబరం ప్రశ్నించారు. చరిత్రకారులు చెప్పినదే సత్యంగా భావించాల్సి ఉంటుందన్నారు. ''చరిత్ర ప్రకారం, తురువవాడుతాయి అధీనం ప్రతినిధులు 1947 ఆగస్టు 14న రైలులో నెహ్రూను కలిసేందుకు వెళ్లారు. విమానంలో కాదు. నెహ్రూను కలుసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత నెహ్రూకు ఒక సావనీర్‌గా సెంగోల్ ఇచ్చారు. ఆ సమయంలో నెహ్రూకు చాలా జ్ఞాపికలు వచ్చాయి. వాటన్నింటినీ జాగ్రత్తగా అలహాబాద్ మ్యూజియంలో ఉంచారు. ఆ రోజు అసలు మౌంట్‌బాటన్ ఢిల్లీలోనే లేరు. ఆరోజు ఆయన పాకిస్థాన్‌లో ఉన్నారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీ వచ్చారు. రాత్రి 11.30 గంటలకు నెహ్రూ ప్రసంగం సమయంలో స్వాతంత్ర్య వేడుకలకు వచ్చారు. అసలు జరిగిన విషయం ఇది. చరిత్రకారులు రాసిన విషయాలు ఇవి. తక్కనవన్నీ దాని చుట్టూ అల్లిన కథలే'' అని చిదంబరం పేర్కొన్నారు.

నెటిజెన్లు సైతం..

పార్లమెంటు నూతన భవనంలో సెంగోల్ ప్రతిష్టించడంపై సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు విమర్శలూ కూడా వ్యక్తమయ్యాయి. మౌంట్‌బాటన్ చేతుల మీదుగా నెహ్రూ సెంగోల్ తీసుకున్నట్టు ఆధారాలు లేవని, ఉంటే ఆ ఫోటోలు ఎందుకు చరిత్రలో చోటుచేసుకోలేదని, అసలు సెంగోల్‌కు ప్రాధాన్యతంటూ ఏమీ లేదని నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. పార్లమెంటు భవనాన్ని రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతితో ప్రారంభించాల్సి ఉండగా ఆ విషయాన్ని మరుగున పెట్టేందుకు 'సెంగోల్' వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని కొందరు ఆక్షేపించారు. కనీసం ఉపరాష్ట్రపతిని కూడా సమావేశానికి ఆహ్వానించకపోవడాన్ని మరికొందరు తప్పుపట్టారు. తమిళ మఠాథిపతులకు ప్రాధాన్యం ఇవ్వడం వెనుక రాజకీయంగా ఆ రాష్ట్రంలో బలపడాలనే ఆలోచన కూడా లేకపోలేదని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మొత్తంమీద, సెంగోల్ వ్యవహారం నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అనేక ప్రధానాంశాలను పక్కకు నెట్టేసిందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది.

Updated Date - 2023-05-31T21:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising