Narendra Modi: సౌతాఫ్రికాలో వింత ఘటన.. విమానం నుంచి దిగేందుకు నిరాకరించిన ప్రధాని మోదీ.. కారణం ఇదే!
ABN, First Publish Date - 2023-08-24T16:09:37+05:30
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న విషయం తెలిసిందే. జోహన్నస్‌బర్గ్‌లో నిర్వహించిన బ్రిక్స్ వార్షిక సదస్సులో పాల్గొనడం కోసం ఆయన అక్కడికి వెళ్లారు. అయితే.. భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు మోదీ వెళ్లినప్పుడు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న విషయం తెలిసిందే. జోహన్నస్‌బర్గ్‌లో నిర్వహించిన బ్రిక్స్ వార్షిక సదస్సులో పాల్గొనడం కోసం ఆయన అక్కడికి వెళ్లారు. అయితే.. భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు మోదీ వెళ్లినప్పుడు.. ఒక అనూహ్యమైన ఘటన చోటు చేసుకున్నట్టు ‘డైలీ మావెరిక్’ అనే వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయిన తర్వాత మోదీ కిందకు దిగేందుకు నిరాకరించారని, ఇందుకు కారణం తనని స్వాగతించేందుకు సీనియర్ అధికారిని పంపకపోవడమేనని ఆ కథనంలో పేర్కొంది. అయితే.. మోదీని ఘనంగా స్వాగతించాలని తాము ప్లాన్ చేశామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని దక్షిణాఫ్రికా వైస్ ప్రెసిడెంట్ పాల్ మషాతిలేకు చెందిన అధిరాక ప్రతినిధి తెలిపారు. ప్రధాని మోదీని స్వాగతించేందుకు.. బ్రిక్స్ సదస్సు జరుగుతున్న జోహన్నస్‌బర్గ్‌కు సమీపంలో ఉన్న ప్రిటోరియాలోని వాటర్‌క్లూఫ్ ఎయిర్ బేస్‌కు ముషాతిల్ ముందుగానే చేరుకున్నారని ఆ ప్రతినిధి పేర్కొన్నారు.
డైలీ మావెరిక్ కథనం ప్రకారం.. తొలుత ప్రధాని మోదీని స్వాగతించేందుకు వాటర్‌క్లూఫ్ ఎయిర్‌బేస్‌కు క్యాబినెట్ మినిస్టర్‌ని పంపించారు. తన కోసం ఒక క్యాబినెట్ మంత్రిని పంపించడం పట్ల నొచ్చుకున్న ప్రధాని మోదీ.. విమానం నుంచి దిగేందుకు నిరాకరించారు. మరోవైపు.. దక్షిణాఫ్రియా ప్రెసిడెంట్ సిరిల్ రమాఫోసా సోమవారం రాత్రి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ని పలకరించేందుకు వెళ్లారు. ఈ ఈవెంట్‌లో వైస్ ప్రెసిడెంట్ పాల్ మషాతిలే కూడా ఉన్నారు. అయితే.. మోదీ నొచ్చుకున్న విషయం తెలిసి, పాల్ వెంటనే ఆ ఈవెంట్‌ని వదిలి, మోదీని స్వాగతించేందుకు వాటర్‌క్లూఫ్ ఎయిర్‌బేస్‌కు వెళ్లారు. ఈ మొత్తం వ్యవహారాన్ని డైలీ మావరిక్ ‘టఫ్ లవ్ ట్రయాంగిల్’గా పేర్కొంది. రమాఫోసా ఎక్కువగా జి జిన్‌పింగ్‌పై దృష్టి సారించారని, దాంతో మోదీ తనని స్వాగతించేందుకు అధ్యక్షుడు రాకపోవడంతో విమానంలో నుంచి దిగేందుకు నిరాకరించారని ఆ వార్తా సంస్థ తన కథనంలో వివరించింది. అంతేకాదు.. జి జిన్‌పింగ్ పర్యటనకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, కానీ మోదీ మాత్రం అదే విధమైన ఏర్పాట్లు చేయలేకపోయిందని ఆ కథనం వెల్లడించింది.
అయితే.. డైలీ మావెరిక్ ప్రచురించిన ఈ కథనాన్ని ప్రభుత్వ అధికారులు ఖండించారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ & కోఆపరేషన్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి లుంగా ఎంగ్‌కెంగ్‌లేలే మాట్లాడుతూ.. శాండ్‌టన్ కన్వెన్షన్ సెంటర్‌లో సంబంధిత దేశాధినేతలను ఎవరెవరు స్వీకరించాలనే దానిపై బ్రిక్స్ సహచరులతో ఏర్పాటు చేయడం జరిగిందని సమాధానం ఇచ్చారు. తమకు భారత ప్రతినిధుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమవ్వలేదని అన్నారు. వర్కింగ్ విజిట్స్‌లో మంత్రులు ఇలా దేశాధినేతలకు స్వాగతం పలకడం సర్వసాధారణమన్నారు. బ్రెజిల్ దేశాధ్యక్షుడు లులా ద సిల్వాను విదేశాంగ మంత్రి నలేడి పాండోర్ స్వాగతించారని చెప్పుకొచ్చారు. మోదీని ఎవరు స్వాగతిస్తారన్న విషయం భారత ప్రభుత్వానికి ముందుగానే తెలుసన్నారు. అటు.. వైస్ ప్రెసిడెంట్ పాల్ మషాతిలే అధికార ప్రతినిధి కూడా డైలీ మావెరిక్ కథనాన్ని ఖండించారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.
Updated Date - 2023-08-24T16:12:02+05:30 IST