Air India threat: ఖలిస్థానీ టెర్రరిస్టు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
ABN, First Publish Date - 2023-11-20T19:57:48+05:30
ఎయిర్ ఇండియా ప్రయాణికులను బెదిరిస్తూ వీడియో విడుదల చేసిన ఖలిస్థాన్ అనుకూల నిషేధిత సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ టెర్రరిస్టు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోమవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (Air India) ప్రయాణికులను బెదిరిస్తూ వీడియో విడుదల చేసిన ఖలిస్థాన్ అనుకూల నిషేధిత సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) టెర్రరిస్టు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh pannun)పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సోమవారంనాడు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసింది. ఐపీసీలోని సెక్షన్ 120B, 153A,506 కింద, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967లోని సెక్షన్ 10,13,16,17,18,18B, 20 కింద పన్నూన్‌పై కేసులు నమోదు చేసినట్టు ఎన్ఐఏ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దని, నవంబర్ 19వ తేదీ, ఆ తర్వాత ఆ విమానాల్లో ప్రయాణిస్తే వారి ప్రాణాలకు ముప్పు తప్పదని పన్నున్ ఒక వీడియోలో హెచ్చరించారు. ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది. ఎయిర్ ఇండియా ఆపరేషన్‌ను ప్రపంచంలో ఎక్కడ నుంచి కూడా జరగనీయమని కూడా ఆయన హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో కెనడా, ఇండియాతో సహా ఎయిర్ ఇండియా సర్వీసులు నడుస్తున్న ప్రపంచ దేశాల్లో భద్రతా సంస్థలను అప్రమత్తం చేసినట్టు ఎన్ఐఏ తెలిపింది. పన్నూన్ గతంలోనూ రైల్వేలు సహా నిత్యావసర రవాణా నెట్‌వర్స్ సిస్టమ్స్, ఇండియాలోని ధర్మల్ పవర్ ప్లాంట్స్‌కు ఇదే తరహాలో హెచ్చరికలు చేసినట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చ్టటం కింద ఎస్‌ఎఫ్‌జేను హోం మంత్రిత్వ శాఖ నిషేధించింది. 2020 జూలై 1న 'Individual terrorist'గా ఆయనను కేంద్రం ప్రకటించింది. 2019లో తొలిసారి పన్నూన్‌పై కేసు నమోదైనప్పటి నుంచి ఎన్ఐఏ అతని కోసం గాలిస్తోంది.
Updated Date - 2023-11-20T19:57:50+05:30 IST