Basavaj Bommai: మోదీని ఓడించడం అసాధ్యం, విపక్షాలకు దిశానిర్దేశం లేదు..!
ABN, First Publish Date - 2023-07-16T15:54:29+05:30
విపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశం కానుండటంపై బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పెదవి విరిచారు. ఇలాంటి సమావేశాలు భవిష్యత్తులో కూడా జరగవచ్చని, అయితే వాటి ప్రభావం ఏమాత్రం ఉండదని అన్నారు.
న్యూఢిల్లీ: విపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశం కానుండటంపై బీజేపీ (BJP) సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavarj Bommai) పెదవి విరిచారు. ఇలాంటి సమావేశాలు భవిష్యత్తులో కూడా జరగవచ్చని, అయితే వాటి ప్రభావం ఏమాత్రం ఉండదని అన్నారు. మోదీని ఓడించడం అసాధ్యమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి మోదీని, బీజేపీని ఓడించాలనే ఏకైక కారణం మినహాయిస్తే విపక్షాలు ఐక్యం కావడానికి ఒక నిర్దిష్ట కార్యక్రమం అంటూ ఏమీ లేదని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ బొమ్మై చెప్పారు. ''జాతీయ స్థాయిలో బలమైన విపక్ష పార్టీ అంటూ ఏదీ లేదు. ఎక్కువగా ఉన్నవన్నీ ప్రాంతీయ పార్టీలే. అలాంటప్పుడు విపక్ష పార్టీల కూటమి ఏర్పాటు, దానికోసం సమావేశం జరపడంలో అర్థం లేదు. రాజకీయంగా కూడా వాళ్లకు (విపక్షాలు) ఎలాంటి ప్రయోజనం చేకూరదు'' అని మాజీ సీఎం అభిప్రాయపడ్డారు. కలిసికట్టుగా మోదీని ఓడించాలనే ఏకైక ఉద్దేశం మినహాయిస్తే సొంత బలం అంటూ ఎవరికీ లేదనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.
దేశం ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా బలపడిందని, కోవిడ్ అనంతరం కూడా వేగంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని, కోవిడ్‌ను సమర్ధవంతంగా అదుపుచేసిన దేశంగా అంతర్జాతీయంగా భారత్‌కు గుర్తింపు వచ్చిందని బొమ్మై అన్నారు. దేశ భద్రత, ప్రగతి, ఆర్థికాభివృద్ధి, విద్య, సామాజిక వృద్ధి అనేవి ఒక్క మోదీ వల్లే సాధ్యమనే విషయం ప్రజలకు బాగా తెలుసునని చెప్పారు. విపక్షాలు ఎన్ని సమావేశాలు జరిపినా, భవిష్యత్తులో మరిన్ని సార్లు సమావేశమైనా, ఆ ప్రభావం ఏదీ ఉండదని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు విపక్షాల ఐక్యతా కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా జూన్ 23న పాట్నాలో తొలి సమావేశం జరిగింది. ఇందులో 15 పార్టీలు పాల్గొన్నాయి. దీనికి కొనసాగింపుగా బెంగళూరులో ఈనెల 17,18 తేదీల్లో విపక్షాల రెండవ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కూడా ఇందులో పాల్గోనున్నారు. 24 విపక్ష పార్టీల నేతలు ఈ రెండ్రోజుల సమావేశంలో పాల్గొంటారని, ఈ సమావేశంలోనే ఐక్యకూటమి రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరిస్తారని చెబుతున్నారు.
Updated Date - 2023-07-16T15:57:41+05:30 IST