Akhilesh Yadav: 'ఇండియా' కూటమి, పీడీఏపై అఖిలేష్ చిత్రమైన సమాధానం..!
ABN, First Publish Date - 2023-10-30T17:14:52+05:30
'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీడీఏ నినాదం ఎత్తుకున్నారు. దీనిపై అఖిలేష్ తాజా వివరణ ఇచ్చారు. ఇండియా కూటమి ఉంటుందని, పీడీఏ అనేది తమ పార్టీ వ్యూహమని చెప్పారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఓడించేందుకు ఏర్పడిన 'ఇండియా' (I.N.D.A.I.) కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీడీఏ (Pichde, Dalit, Alpasankhyak) నినాదం ఎత్తుకున్నారు. దీంతో ఇండియా కూటమితో అఖిలేష్ సంబంధాలపై అనుమానాలు తలెత్తాయి. దీనిపై అఖిలేష్ యాదవ్ సోమవారంనాడు మీడియా అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. 'ఇండియా' కూటమి అలాగే ఉంటుందని, పీడీఏ అనేది తమ పార్టీ వ్యూహామని చెప్పారు.
వెనుకబడిన వర్గాలు (పిచ్చే), దళిత (దళిత్), మైనారిటీల (అల్పసంక్షాక్) ఓట్లు లక్ష్యంగా పార్టీ అనుసరిస్తున్న వ్యూహమే పీడీఏ అని, బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే)ను ఓడించడమే పీడీపీ ఉద్దేశమని అఖిలేష్ వివరించారు. ఇండియా కూటమి యథాతథంగా ఉంటుందని, పీడీఏ తమ పార్టీ వ్యూహమని తెలిపారు. పీడీఏ మొదట ఏర్పడిందని, ఆ తర్వాత ఇండియా కూటమి వచ్చిందని, ఇండియా కూటమి ఉన్నప్పటికీ తమ వ్యూహం మాత్రం పీడీఏనని గతంలో పలుమార్లు తాను స్పష్టత ఇచ్చినట్టు తెలిపారు.
వివాదం ఏమిటి?
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి 6 సీట్లు ఇస్తామని చెప్పిన రాష్ట్ర కాంగ్రెస్ ఆ తర్వాత తమకు మొండి చేయి చూపించిందని అఖిలేష్ ఇటీవల వరుస విమర్శలు గుప్పించారు. పీడీఏ నినాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. పొత్తు ఉండదని ముందే చెబితే కాంగ్రెస్ నేతలను కలవడం కానీ, మాట్లాడటం కానీ జరిగేదే కాదన్నారు. అఖిలేష్ కామెంట్లపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు సమస్యను మరింత జఠిలం చేశాయి. 'లీవ్ దిస్ అఖిలేష్ వఖిలేష్' అంటూ కమల్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఇండియా బ్లాక్ అనేది కేంద్ర స్థాయిలోని విషయమని, లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారించాలన్నదే ఆ కూటమి ఉద్దేశమని చెప్పారు. దీనిపై మళ్లీ అఖిలేష్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన ఇలాగే ఉంటే, వారితో ఎవరు ఉంటారని ప్రశ్నించారు. కులగణన అంశం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని కూడా ఆయన నిలదీశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో కులగణాంకాలను ఇవ్వలేదని, వెనుకబడిన తరగతులు, గిరిజనుల మద్దతు లేకుండా గెలవలేమనే విషయం ఇప్పుడు అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. ఆ తరగతులు ఏవీ కాంగ్రెస్ వెనుక లేవనే విషయం కూడా వారికి బాగా తెలుసునంటూ తూర్పారబట్టారు. కాంగ్రెస్ చర్యకు ప్రతిగా ఆ పార్టీ పోటీలో ఉన్న 18 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టింది.
Updated Date - 2023-10-30T17:14:52+05:30 IST