Pervez Musharraf No More : పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత
ABN, First Publish Date - 2023-02-06T00:57:01+05:30
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, కార్గిల్ యుద్ధ కారకుడు పర్వేజ్ ముషారఫ్(79) ఆదివారం దుబాయ్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న ముషారఫ్..
అరుదైన వ్యాధితో దుబాయ్ ఆస్పత్రిలో చికిత్స.. పరిస్థితి విషమించి తుదిశ్వాస
ఢిల్లీలో జననం.. దేశ విభజనతో పాక్‌కు.. సైన్యాధిపతి స్థాయికి ఎదుగుదల
కార్గిల్ యుద్ధం కుట్రదారు.. పాక్ సర్కారు కూల్చివేత.. నియంతృత్వ పాలన
అధ్యక్షుడిగా ఏడేళ్లు.. రాజ్యాంగం రద్దు.. ఎమర్జెన్సీ ప్రకటన.. దానిపై దేశద్రోహం
మరణశిక్ష విధింపు.. 2016 నుంచి దుబాయ్‌లోనే.. 3 సార్లు భారత్ పర్యటన
కశ్మీర్‌పై విఫలమైన ఆగ్రా సమ్మిట్.. శశిథరూర్ నివాళి.. భగ్గుమన్న బీజేపీ
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్/దుబాయ్, ఫిబ్రవరి 5: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, కార్గిల్ యుద్ధ కారకుడు పర్వేజ్ ముషారఫ్(79) ఆదివారం దుబాయ్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న ముషారఫ్.. దుబాయ్‌లోని అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూశారని దుబాయ్‌లోని పాక్ హైకమిషన్ తెలిపింది. ప్రత్యేక జెట్‌లో ఆయన మృతదేహాన్ని రావల్పిండికి తరలిస్తామని పేర్కొంది. ముషారఫ్ మృతిపట్ల పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, సైనాధికారులు నివాళులర్పించారు. ముషారఫ్ 1943 ఆగస్టు 11న ఢిల్లీలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం పాకిస్థాన్‌కు వలస వెళ్లింది. 21ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరిన ముషారఫ్.. అంచెలంచెలుగా సైన్యాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో సెకండ్ లెఫ్టినెంట్‌గా పనిచేశారు. 1971 యుద్ధం సమయంలో ఎస్‌ఎ్‌సజీ బెటాలియన్ కంపెనీ కమాండర్‌గా వ్యవహరించారు. తర్వాత పాక్ సైన్యాధ్యక్షుడిగా ఎదిగారు. 1999లో కార్గిల్ యుద్ధానికి కుట్రదారు ఇతనే. ఆ తర్వాత నవాజ్ షరీఫ్ సర్కారును కూలగొట్టి మిలటరీ పాలనను ప్రకటించారు. 2001-08 మధ్య పాక్ అధ్యక్షుడిగా పనిచేశారు. పాక్ అధ్యక్షుడి హోదాలో మూడుసార్లు భారత్‌కు వచ్చారు. 2001లో కశ్మీర్ అంశంపై చర్చలకు అప్పటి ప్రధాని వాజ్‌పేయితో చర్చలు జరిపేందుకు ముషారఫ్ ఆగ్రాకు వచ్చారు. అయితే చర్చల్లో ఏకాభిప్రాయం రాలేదు.
వివాదాలెన్నో..
కార్గిల్ యుద్ధానికి దశాబ్దకాలానికి ముందు నుంచే భారత్‌పై పోరుకు ముషారఫ్ కుట్రలు పన్నారు. 1988-89లోనే కార్గిల్ చొరబాటు వ్యూహాన్ని అప్పటి ప్రధాని బెనజీర్ భుట్టోకు ప్రతిపాదించారు. కానీ, ఆమె మాత్రం కార్గిల్ చొరబాటుకు అనుమతివ్వలేదు. దీంతో సమయం కోసం వేచి ఉన్న ముషారఫ్.. నవాజ్ షరీఫ్ అధికారంలోకి రాగానే.. తన వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారు. 1999 మార్చి నుంచి మే మధ్య కాలంలో కార్గిల్‌లోకి సైన్యాన్ని రహస్యంగా చేరవేశారు. దీన్ని భారత్ గుర్తించడంతో..ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైంది.
అందలమెక్కిస్తే అణగదొక్కారు
సైన్యంలో తనకు కీలక పదవిని కట్టబెట్టిన నవాజ్ షరీ్‌ఫపైనే ముషారఫ్ తిరుగుబాటు చేశారు. సైనిక పాలనను ప్రకటించారు. రెండేళ్ల తర్వాత.. అంటే.. 2001లో పాక్ దేశాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. నవాజ్ షరీ్‌ఫను అరెస్టు చేశారు. 2008 వరకు పదవిలో కొనసాగిన ముషారఫ్.. తనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణను అడ్డుకునేందుకు ప్రధాన న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించారు. అంతకు ముందు ఆయన తన పదవిని కాపాడుకునేందుకు రాజ్యాంగాన్ని రద్దుచేసి, ఎమర్జెన్సీ విధించారు. చివరికి అభిశంసన తీర్మానాన్ని తప్పించుకునేందుకు తన పదవికి రాజీనామా చేశారు. పాక్‌లో ఆ తర్వాతి రాజకీయ పరిణామాలు ఆయనకు వ్యతిరేకంగా మారుతూ వచ్చాయి. రాజ్యాంగాన్ని రద్దుచేసినందుకు దేశద్రోహం కేసును ఎదుర్కొన్నారు. 2008లో లండన్‌కు పారిపోయారు. 2013లో పాక్‌కు తిరిగి వచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కోర్టు ఆయనపై అనర్హత వేటు వేసింది. దేశద్రోహం కేసు విచారణలో కోర్టు ఆయనను అరెస్టు చేయాలని ఆదేశించింది. 2016లో బెయిల్ పొందిన ముషారఫ్ వైద్య చికిత్స పేరుతో దుబాయ్‌కి పారిపోయారు.
ఉరితీసి, మృతదేహాన్ని వేలాడదీయండి
దేశద్రోహం కేసులో ముషార్‌ఫకు ఇస్లామాబాద్ కోర్టు 2019లో మరణశిక్ష విధించింది. ‘‘ముషార్‌ఫను ఉరితీయండి. పార్లమెంట్ ఎదురుగా ఉన్న డీ-స్క్వేర్ కూడలి వద్ద ఆయన మృతదేహాన్ని మూడు రోజులు వేలాడదీయండి’’ అని ఆదేశించింది. అయితే.. 2020లో కోర్టు ఆయన శిక్షను తగ్గించడం గమనార్హం..!
ముషారఫ్ అమైలాయిడోసిస్ అనే అరుదైన వ్యాధితో కొన్ని వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందా రు. ఈ రుగ్మతలో అమైలాయిడ్ ప్రొటీన్ ఉత్పత్తి ఎక్కువ స్థాయిలో జరిగి.. శరీర భాగాలకు విస్తరిస్తుం ది. ఈ ప్రొటీన్ ఎక్కువగా ఉండే అవయవాల పనితీ రు క్రమంగా మందగించి, పనిచేయకుండా పోతాయి.
శశిథరూర్ వర్సెస్ బీజేపీ
ముషారఫ్ మృతిపట్ల కాంగ్రెస్ నేత శశిథరూర్ సంతాపం తెలియజేయడంపై బీజేపీ మండిపడింది. ‘‘ఒకప్పటి భారత నిష్కళంక శత్రువు.. ఆ తర్వాత శాంతికి ప్రయత్నించారు. ఆయన మృతిపట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నా’’ అని థరూర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. దీన్ని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా తప్పుబట్టారు. పాక్‌ను ఆరాధించే కాంగ్రెస్ సంస్కృతి బయటపడిందని వ్యాఖ్యానించారు. అందుకే సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తుందన్నారు. కార్గిల్ యుద్ధం కుట్రదారుడు, తాలిబాన్లు, ఒసామా-బిన్-లాడెన్‌ను సోదరులుగా చెప్పుకొనే ముషారఫ్ శాంతిదూతలా కనిపిస్తున్నారా? అని నిలదీశారు.
Updated Date - 2023-02-06T01:01:45+05:30 IST