Congress party PhonePe: కాంగ్రెస్ పార్టీకి ఫోన్‌పే హెచ్చరిక.. కారణం ఏంటో తెలుసా...
ABN, First Publish Date - 2023-06-29T20:02:53+05:30
కర్ణాటక మాదిగానే మధ్యప్రదేశ్ ప్రస్తుత సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ఫొటోను ఫోన్‌పే స్కానింగ్ బార్‌పై ముద్రించిన పోస్టర్లతో ప్రచారం చేస్తోంది. ‘పేసీఎం’ పేరిట గోడలకు అంటించిన పోస్టర్లపై ఫోనోపే అఫీషియల్ లోగోలను కూడా కాంగ్రెస్ పార్టీ వాడింది. దీనిపై ఫోన్‌పే అభ్యంతరం వ్యక్తం చేసింది.
భోపాల్: డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీ ‘ఫోన్‌పే’ (PhonePe) కాంగ్రెస్ పార్టీకి (Congress Party) వార్నింగ్ ఇచ్చింది. రాజకీయ పార్టీని పేమెంట్స్ కంపెనీ హెచ్చరించడం ఏంటి? అని అనుకుంటున్నారా.. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ఇటివల ముగిసిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనాన్ని ఎగురవేసి అధికార పీఠాన్ని దక్కించుకుంది. అక్కడి ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘పేసీఎం’ (PayCM) నినాదాన్ని ఆ పార్టీ విస్తృతంగా వినియోగించుకుంది. ఫోన్‌పే స్కానింగ్ బార్‌పై కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ఫొటో ముద్రించి సాగించిన ప్రచారం పార్టీకి బాగా కలిసొచ్చింది. దీంతో త్వరలోనే ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లోనూ ఇదే పంథాలో ప్రచారం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కర్ణాటక మాదిగానే మధ్యప్రదేశ్ ప్రస్తుత సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ఫొటోను ఫోన్‌పే స్కానింగ్ బార్‌పై ముద్రించిన పోస్టర్లతో ప్రచారం చేస్తోంది. ‘పేసీఎం’ పేరిట గోడలకు అంటించిన పోస్టర్లపై ఫోనోపే అఫీషియల్ లోగోలను కూడా కాంగ్రెస్ పార్టీ వాడింది.
అనధికారికంగా కంపెనీ పేరు, లోగో వాడుతుండడంపై ఫోన్‌పే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించింది. ‘‘ అనధికారికంగా బ్రాండ్ లోగోని ఒక థర్డ్ పార్టీ ఉపయోగించడాన్ని ఫోన్‌పే ఆక్షేపిస్తోంది. రాజకీయ లేదా రాజకీయేతర పార్టీ అయినా సరే. ఎలాంటి రాజకీయ ప్రచారం లేదా పార్టీతో మాకు సంబంధం లేదు’’ అని ట్విటర్‌లో పేర్కొంది.
ప్రచార పోస్టర్లలో ఫోన్‌పే లోగో ఉంది. ఈ లోగో కంపెనీ ట్రేడ్ మార్క్ పేరిట రిజిస్టర్ అయ్యింది. కంపెనీ మేధో సంపత్తి హక్కులను అనధికారికంగా ఉపయోగిస్తే చట్టబద్ధమైన చర్యలు ఉంటాయని ఫోన్‌పే హెచ్చరించింది. పోస్టర్లు తొలగించాలని కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసింది. బ్రాండో లోగో, కలర్ ఉన్న పోస్టర్ల తొలగించాలని హూందాగా కోరుతున్నట్టు వరుస ట్వీట్ల ద్వారా విషయాన్ని వెల్లడించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్‌కు వ్యతిరేకంగా బీజేపీ కూడా ఇదే తరహా ప్రచారం చేసింది. దానికి కౌంటర్‌గా ఇప్పుడు కాంగ్రెస్ ఈ ప్రచారం చేస్తుండడం గమనార్హం.
Updated Date - 2023-06-29T20:59:53+05:30 IST