Physics Wallah: 120 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపిన ప్రముఖ సంస్థ.. ఎందుకంటే?
ABN, First Publish Date - 2023-11-20T12:44:29+05:30
Noida: పనితీరు నచ్చక ప్రముఖ సంస్థ 120 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. నీట్(NEET), జేఈఈ(JEE)లకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చే ఫిజిక్స్ వల్లాహ్(Physics Wallah) గురించే ఈ వార్త.
నోయిడా: పనితీరు నచ్చక ప్రముఖ సంస్థ 120 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. నీట్(NEET), జేఈఈ(JEE)లకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చే ఫిజిక్స్ వల్లాహ్(Physics Wallah) గురించే ఈ వార్త. స్కూల్ దశ నుంచే విద్యార్థులకు నీట్, జేఈఈలలో అత్యుత్తమ ప్రమాణాలతో విద్యనందిస్తూ వార్తల్లో నిలిచిన ఈ సంస్థ తాజా నిర్ణయం ఊహించనిది. ఉద్యోగుల పనితీరు నచ్చక 120 మంది ఉద్యోగుల్ని కంపెనీ తొలగించింది.
ఇది ఏటా జరుగుతుందని.. 0.8 శాతం కంటే తక్కువ పని తీరు కనబరిచిన వారిని తొలగించినట్లు సంస్థ అధికారులు తెలిపారు. కంపెనీలో దాదాపు 12 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కంటెంట్, ఆపరేషన్ తో పాటు పలు విభాగాల్లో ఉద్యోగుల్ని తొలగించినట్లు తెలిపారు. ఖర్చు తగ్గించుకోవడానికి కంపెనీ ప్రయత్నించినట్లు బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. "మేం మిడ్-టర్మ్, ఎండ్-టర్మ్ సైకిల్స్ ద్వారా పనితీరును క్రమం తప్పకుండా అంచనా వేస్తాం.
అక్టోబర్ ముగిసే నాటికి మా వర్క్‌ఫోర్స్‌లో 0.8 శాతం కంటే తక్కువ పనితీరు కనబరిచిన 70 నుంచి 120 మంది వ్యక్తులను తొలగించాం. మా దృష్టి అంతా డైనమిక్ గా పని చేసే బృందాన్ని పెంపొందించడంపై ఉంది. రాబోయే ఆరు నెలల్లో వెయ్యి మంది ఉద్యోగుల్ని నియమించుకోవాలని ప్లాన్ చేస్తున్నాం" అని ఫిజిక్స్ వల్లాహ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) సతీష్ ఖేంగ్రే పేర్కొన్నారు.
కొవిడ్ కాలంలో ఆన్‌లైన్ తరగతులకు పెరిగిన ఆకస్మిక డిమాండ్ ని అందిపుచ్చుకోవడానికి బైజూస్(Byju's), అన్ అకాడమీ(Un Academy), ఎడ్ టెక్(Edtech) కంపెనీలు అదనపు సిబ్బందిని నియమించుకున్నాయి. ఫిజిక్స్ వల్లాహ్ కూడా అదే బాటలో నడిచింది. దీనిని 2020లో యూట్యూబ్ లో ఆన్ లైన్ తరగతులు తీసుకునేవారి కోసం అలఖ్ పాండే, ప్రతీక్ మహేశ్వరి ప్రారంభించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో దీని ప్రధాన కార్యాలయం ఉంది.
Updated Date - 2023-11-20T12:45:38+05:30 IST