BRICS : బ్రిక్స్ దేశాల నేతలకు మోదీ ఆకర్షణీయ బహుమతులు
ABN, First Publish Date - 2023-08-25T14:33:50+05:30
బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల నేతలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ఆకర్షణీయమైన బహుమతులను ఇచ్చారు. భారత దేశ సంస్కృతి, వారసత్వాల ఔన్నత్యాన్ని ఈ బహుమతులు ప్రతిబింబిస్తున్నాయి. వీటిలో తెలంగాణలో ప్రసిద్ధి పొందిన సురహి కూడా ఉంది.
జొహన్నెస్‌బర్గ్ : బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల నేతలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అత్యంత ఆకర్షణీయమైన బహుమతులను ఇచ్చారు. భారత దేశ సంస్కృతి, వారసత్వాల ఔన్నత్యాన్ని ఈ బహుమతులు ప్రతిబింబిస్తున్నాయి. వీటిలో తెలంగాణలో ప్రసిద్ధి పొందిన సురహి కూడా ఉంది.
తెలంగాణకు చెందిన సురహి (పొడవైన మెడ ఉండే కూజా)ల జతను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు ఇచ్చారు. ఆయన సతీమణి త్షెపో మొట్సెపేకి నాగాలాండ్‌లో తయారైన శాలువను బహూకరించారు. ఈ సురహి సృష్టి పూర్తిగా భారత దేశంలోనే జరిగింది. కర్ణాటకలోని బీదర్‌లో 500 ఏళ్ల క్రితం మొదట దీనిని తయారు చేశారు. జింక్, రాగి, ఇతర నాన్ ఫెర్రస్ లోహాలతో దీనిని తయారు చేస్తారు. బీదర్ కోటలో ఉండే ప్రత్యేకమైన మట్టికి విశిష్ట ఆక్సీకరణ లక్షణాలు ఉంటాయి. ఈ మట్టిని దీని తయారీలో ఉపయోగిస్తారు. జింక్ లోహం అత్యంత ఆకర్షణీయమైన నలుపు రంగులో కనిపించడానికి ఇది దోహదపడుతుంది. నలుపు నేపథ్యంలో స్పష్టంగా కనిపించేవిధంగా స్వచ్ఛమైన వెండిని తాపడం చేస్తారు.
నాగాలాండ్ శాలువలకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడి గిరిజనులు ఈ శాలువలను తయారు చేస్తారు. అద్భుతమైన వస్త్ర కళా నైపుణ్యం దీనిలో కనిపిస్తుంది. తళతళ మెరిసే రంగులు, మిరుమిట్లుగొలిపే డిజైన్లు, సంప్రదాయ చేనేత నైపుణ్యం వీటిలో కనిపిస్తాయి. నాగాలాండ్ గిరిజనులకు ఈ నైపుణ్యాలు వారసత్వంగా ఒక తరం నుంచి మరొక తరానికి లభిస్తాయి.
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లుల డా సిల్వకు మధ్య ప్రదేశ్‌లో తయారైన గోండ్ పెయింటింగ్‌ను మోదీ బహూకరించారు. గిరిజన కళారూపాల్లో గోండ్ చిత్రకళ ఒకటి. గోండ్ అంటే పచ్చని పర్వతం అని అర్థం. స్థానికంగా దొరికే సహజసిద్ధమైన రంగులు, చార్‌కోల్, రంగు మట్టి, ఆకులు, ఆవు పేడ, లైమ్‌స్టోన్ పౌడర్ వంటివాటితో ఈ చిత్రాలను రూపొందిస్తారు.
ఇవి కూడా చదవండి :
Xi Jinping Vs Modi : భారత్-చైనా సంబంధాలు.. మోదీకి సుద్దులు చెప్పిన జిన్‌పింగ్..
PM Post : తదుపరి ప్రధాన మంత్రి అమిత్ షా!.. యోగికి నో ఛాన్స్!..
Updated Date - 2023-08-25T14:49:59+05:30 IST