Narendra Modi: డీబీటీ కారణంగా వారంతా నాపై కోపంగా ఉన్నారు
ABN, First Publish Date - 2023-04-26T21:29:59+05:30
ఓ జాతీయ ఛానెల్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: ఓ జాతీయ ఛానెల్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీతో (Goods and Services Tax) నల్లధనానికి చెక్ పెట్టామన్నారు. డీబీటీతో(Direct Benefit Transfer) అవినీతి అంతమైందని, దీంతో అవినీతిపరులు తనపై కోపంగా ఉన్నారని మోదీ చెప్పారు. సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేకూరుతోందన్నారు. హౌజింగ్ స్కీమ్, ముద్ర రుణాల గురించి ప్రధాని ప్రస్తావించారు. మూడు కోట్ల 75 లక్షల మందికిపైగా ఇళ్లు కట్టించి ఇచ్చామన్నారు. ఇంటి యాజమాన్య హక్కులు మహిళలకు ఇచ్చామని, కోట్లాది మంది సోదరీమణులు లక్షాధికారులయ్యారని ప్రధాని చెప్పారు. తమకు అందుతున్న వాటాతో పేద ప్రజలు సామాజిక న్యాయం జరుగుతోందని భావిస్తున్నారని మోదీ చెప్పారు. ముద్రా పథకం ద్వారా కోట్లాది మంది చిరువ్యాపారులకు రుణాలు అందించామన్నారు.
తమ తొమ్మిదేళ్ల పాలనలో 9వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి భారత్ ఐదో పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధాని చెప్పారు. 9 సంవత్సరాలుగా దళితులు, పేదల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకొచ్చామని మోదీ చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజల కోసం 80 వేల కోట్లు ఖర్చుపెట్టామన్నారు. కోవిడ్ సమయం నుంచి నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలతో పేద ప్రజలకు అన్న యోజన ద్వారా ఉచితంగా బియ్యం అందిస్తున్నామని ప్రధాని చెప్పారు. మన్‌రేగా డబ్బులు కార్మికులకు 15 రోజుల్లోనే అందుతున్నాయని చెప్పారు. లక్షల కోట్లు దుర్వినియోగం కాకుండా కాపాడామన్నారు.
కోవిడ్ సమయంలో అత్యంత నాణ్యమైన స్వదేశీ వ్యాక్సిన్లు తయారు చేశామని మోదీ చెప్పారు. ఇతర దేశాల వాళ్లు తయారు చేస్తున్నప్పుడు దేశీయంగా వ్యాక్సిన్లు తయారు చేయడం ఎందుకని కొందరు ప్రశ్నించారని మోదీ గుర్తు చేశారు. ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్లు పంపిణీ చేశామన్నారు.
డిజిటల్ ఇండియాను కూడా పక్కదారి పట్టించేందుకు కొందరు యత్నించారని మోదీ చెప్పారు. డిజిటల్ ఇండియా ద్వారా దేశ ఆర్ధిక స్వరూపాన్నే మార్చేశామన్నారు. చాయ్ దుకాణం నుంచి కూరగాయల దుకాణాల వరకూ డిజిటల్ పేమెంట్స్ అవుతున్నాయని మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ పేమెంట్స్ భారత్‌లోనే జరుగుతున్నాయని మోదీ గుర్తు చేశారు.
సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో పది కోట్ల మంది నకిలీ పేర్లతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిధులు పంచారని, తాము నకిలీలను ఏరిపారేశామన్నారు.
అవినీతి, కుటుంబ రాజకీయాలపై తమ పోరు కొనసాగుతుందని మోదీ స్పష్టం చేశారు.
Updated Date - 2023-04-26T21:45:48+05:30 IST