PM Narendra Modi: రైతుల పేరుతో రాజకీయాలు చేశారంటూ.. శరద్ పవార్‌పై ప్రధాని మోదీ ధ్వజం
ABN, First Publish Date - 2023-10-26T19:38:02+05:30
ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పేరు ప్రస్తావించకుండా, పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రైతుల పేరుతో ఆయన రాజకీయాలు చేశారని...
ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పేరు ప్రస్తావించకుండా, పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రైతుల పేరుతో ఆయన రాజకీయాలు చేశారని ఆరోపణలు గుప్పించారు. ఆయన చాలా సంవత్సరాలపాటు వ్యవసాయ మంత్రిగా ఉండి కూడా రైతులకు ఏం చేయలేకపోయారని, సమయానికి రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని వ్యాఖ్యానించారు. ఆ రోజుల్లో రైతులు మధ్యవర్తులపై ఆధారపడాల్సి వచ్చేదని అన్నారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో గురువారం పలు ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం తన ప్రసంగంలో మోదీ ఈ విధంగా శరద్ పవార్‌పై ధ్వజమెత్తారు.
“మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నాయకుడు కేంద్ర ప్రభుత్వంలో చాలా సంవత్సరాల పాటు వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. నేను వ్యక్తిగతంగా ఆయన్ను గౌరవిస్తాను. కానీ.. ఆయన రైతులకు ఏం చేశాడు. తన ఏడేళ్ల పదవికాలంలో ఆయన దేశవ్యాప్తంగా రైతుల నుండి కేవలం రూ. 3.5 లక్షల కోట్ల విలువైన ధాన్యాన్ని ఎంఎస్‌పీకి కొనుగోలు చేశాడు. కానీ.. ఆ ఏడేళ్ల కాలంలోనే మా ప్రభుత్వం రూ. 13.5 లక్షల కోట్లు రైతులకు ఇచ్చింది’’ అని మోదీ చెప్పుకొచ్చారు. 2014కి ముందు కేవలం రూ.500-600 కోట్ల పప్పులు, నూనె గింజలు మాత్రమే ఎంఎస్‌పీపై కొనుగోలు చేశారని.. కానీ తమ ప్రభుత్వం రూ. 1 లక్షా పదిహేను వేల కోట్లకు పైగా డబ్బులను పప్పులు, నూనె గింజల రైతులకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిందని పేర్కొన్నారు.
ఆయన (శరద్ పవార్’ వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు రైతులు తమ డబ్బు కోసం మధ్యవర్తులపై ఆధారపడాల్సి వచ్చేదని.. ఆ రోజుల్లో నెలల తరబడి రైతులకు డబ్బులు చెల్లించలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. తమ ప్ఱభుత్వం మాత్ర రైతు బ్యాంకు ఖాతాకు నేరుగా ఎంఎస్‌పీ సొమ్ము వచ్చేలా ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. చెరుకు రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చక్కెర మిల్లులు, సహకార సంఘాలకు వేల కోట్ల రూపాయల సాయం కూడా అందించామన్నారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. రైతులు ఇప్పుడు తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పొందుతున్నారని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-10-26T19:38:02+05:30 IST